కోల్‌కతా: స్వదేశంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) చాంపియన్లు దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. సంప్రదాయకంగా స్పిన్‌కు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్‌లో భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/27) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులకే చేతులెత్తేసింది. మార్క్మ్(్ర31) టాప్‌స్కోరర్. బుమ్రాకు తోడు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/47), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (2/36) తలా రెండు వికెట్లు పడగొట్టడంతో సఫారీలు ఏ దశలోనూ కోలుకోలేక చతికిలపడ్డారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది. రెండో రోజు భారత బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తే మ్యాచ్‌పై గిల్ సేన పట్టు బిగించడం ఖాయం!
సుమారు పుష్కరకాలం తర్వాత భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు స్పిన్నర్ల (కుల్దీప్, జడేజా, అక్షర్, వాషింగ్టన్)తో బరిలోకి దిగినా.. బుమ్రా మాత్రం మరోసారి తన విలువను చాటుకునే ప్రదర్శన చేశాడు. ఉదయం సెషన్లో పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ సఫారీ టాపార్డర్‌ను దెబ్బకొట్టి ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు ఓపెనర్లు రికెల్టన్ (23), మార్క్మ్ శుభారంభమే అందించారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ పది ఓవర్లలోనే 57 పరుగులు జోడించి దూకుడు మీద కనిపించారు. కానీ 11వ ఓవర్లో బుమ్రా.. రికెల్టన్ను క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు.
తన తర్వాతి ఓవర్లో అతడు.. మార్క్మ్న్రూ పెవిలియన్‌కు పంపాడు. డ్రింక్స్ విరామం తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో కెప్టెన్ టెంబా బవుమా (3) ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్‌లో జురెల్ అందుకోవడంతో ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో టోని డి జార్జి (24), మల్డర్ (24) ఆదుకునే యత్నం చేశారు. సుమారు 15 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న ఈ జోడీని లంచ్ విరామం తర్వాత కుల్దీప్ విడదీశాడు. 30వ ఓవర్లో అతడు మల్డర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాక దక్షిణాఫ్రికా వికెట్ల పతనం వేగంగా సాగింది. ఒక దశలో 111/3తో ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 48 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది.
లంచ్ తర్వాత రెండో స్పెల్‌కు వచ్చిన బుమ్రా.. జార్జిని ఎల్బీగా వెనక్కిపంపించాడు. రెండో సెషన్లో డ్రింక్స్ విరామం అనంతరం బంతినందుకున్న సిరాజ్.. బుమ్రా స్ఫూర్తితో సఫారీ లోయరార్డర్ పనిపట్టాడు. ఒకే ఓవర్లో కైల్ వెరీన్ (16), యాన్సెన్‌ను ఔట్ చేసి ఆ జట్టును కోలుకోనీయకుండా చేశాడు. టీ విరామం ముగిశాక 55వ ఓవర్లో బుమ్రా.. హార్మర్ (5), మహారాజ్‌ను ఔట్ చేసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో అతడు ఐదు వికెట్ల ఘనతనూ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా.. నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ను మొదలెట్టింది. పిచ్ పేసర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో సౌతాఫ్రికా.. యాన్సెన్, మల్డర్‌తో ఎక్కువ ఓవర్లు వేయించడంతో భారత బ్యాటర్లు నింపాదిగా ఆడారు. మూడు బౌండరీలు కొట్టిన జైస్వాల్ (12)ను యాన్సెన్ ఏడో ఓవర్లో బౌల్డ్ చేయడంతో భారత్ తొలి వికెట్ నష్టపోయింది. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన వాషింగ్టన్ సుందర్ (38 బంతుల్లో 6*)తో కలిసి కేఎల్ రాహుల్ (59 బంతుల్లో 13*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. ఇంకా 122 రన్స్ వెనుకబడి ఉంది.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఓవర్లలో 159 ఆలౌట్ (మార్క్మ్ 31, మల్డర్ 24, బుమ్రా 5/27, కుల్దీప్ 2/36)
భారత్: 20 ఓవర్లలో 37/1 (రాహుల్ 13*, జైస్వాల్ 12, యాన్సెన్ 1/11)