రూర్కెలా : ప్రపంచ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలి రోజు శుక్రవారం స్పెయిన్‌తో తమ పోరును ఆరంభించనున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన ఉత్సాహంతో హర్మన్‌ప్రీత్ సింగ్ సారధ్యంలోని భారత జట్టు పోడియం ఫినిష్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. చివరిసారి 1975లో టైటిల్ గెలిచిన ఇండియా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని కాంక్షతో ఉంది. ఎనిమిదిసార్లు వరుసగా ఒలింపిక్ స్వర్ణం సాధించిన భారత జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆశించిన మేరకు రాణించలేకపోతున్నది.
ఈ టోర్నీలో 1978నుంచి గ్రూపు స్థాయిని దాటలేకపోయింది. ఈసారి సెమీస్ చేరుకోవడం తమ తొలి లక్ష్యమని గోల్‌కీపర్ శ్రీజేష్ వెల్లడించాడు. ప్రధాన కోచ్‌గా రీడ్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత జట్టు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. ఈసారి ఇండియాకు పతకం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని రీడ్ ఆశాభావం వ్యక్తంచేశాడు.