Womens Asia Cup : మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. చైనాలోని హంగ్జౌ (Hangzhou) వేదికగా సెప్టెంబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ షురూ కానుంది. 10 రోజుల పాటు జరుగనున్న ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. గ్రూప్ బీలో చోటు దక్కించుకున్న భారత జట్టు తొలి పోరులో థాయ్‌లాండ్‌ను ఢీ కొట్టనుందని బుధవారం హాకీ ఇండియా (Hockey India) వెల్లడించింది.
గత ఎడిషన్‌లో కాంస్యం కొల్లగొట్టిన టీమిండియా ఈసారి పసిడిపై గురి పెట్టింది. మరో విషయం ఏంటంటే.. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు 2026 మహిళల ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ (FIH World Cup) పోటీలకు నేరుగా అర్హత సాధించనుంది. సో.. భారత జట్టు ఈ ఈవెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే కసితో ఉంది.
ఆసియా కప్ పోటీలకు అర్హత సాధించిన జట్లను గ్రూప్ ఏ, గ్రూప్ బీలుగా విభజించారు నిర్వాహకులు. పూల్ – ఏ లో చైనా, కొరియా, మలేషియా, చైనీస్ తైపీ జట్లకు చోటు దక్కింది. పూల్ – బీలో భారత్, జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత జట్టు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 6న డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్, సెప్టెంబర్ 8న సింగపూర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా.
‘పూల్ బీలో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాలే. కానీ, ఆరంభంలోనే కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోవడం ద్వారా మా క్రీడాకారిణుల నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రస్తుతానికి బాగా ఆడడంపైనా, క్రమశిక్షణతో ఉండడం మీద మాత్రమే మేము దృష్టి పెడుతున్నాం. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఫైనల్‌కు చేరడంతో పాటు ట్రోఫీ గెలవాలనే కసితో ఉన్నాం. తద్వారా 2026 మహిళల ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించాలనేది మా ప్రధాన ఉద్దేశం’ అని భారత సారథి సలీమా టెటే (Salima Tete) వెల్లడించింది. 2017లో చివరిసారిగా భారత జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది.