Indian Football Team : భారత ఫుట్‌బాల్ జట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్(2026 FIFA World Cup Qualifier)లో సునీల్ ఛెత్రీ సేన మంగళవారం ఖతర్‌ను ఢీకొననుంది. వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో ఇరుజట్లు తలపడడం ఇది రెండోసారి.
2019లో దోహాలో జరిగిన 2022 వరల్డ్ కప్ క్వాలిఫయర్ రెండో రౌండ్లో భారత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఖతర్‌ను నిలువరించి.. 0-0తో మ్యాచ్‌ను డ్రా చేసి ఔరా అనిపించింది. ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని టీమిండియా భావిస్తోంది.
క్వాలిఫయర్‌లో నవంబర్ 16న కువైట్‌పై 1-0తో గెలిచిన భారత్ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మంగళవారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. 61వ ర్యాంక్‌లో ఉన్న ఖతర్ తొలి మ్యాచ్‌లో అప్గనిస్థాన్ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన పోరులో 8-1తో గెలుపొందింది.