లీడ్స్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని భారత్ అదే జోరు కొనసాగిస్తూ డచ్ టీమ్ భరతం పట్టాలని చూస్తున్నది. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ముఖాముఖి తలపడుతున్న ఇరు జట్లు సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నాయి. అయితే భారత్ కొన్ని విభాగాల్లో మెరుగు కావాల్సిన అవసరమున్నది.
యువ ఓపెనర్ షెఫాలీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది 12 టీ20 మ్యాచ్‌ల్లో 266 పరుగులకే పరిమితమైంది. మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫల్మాలి బ్యాట్లు ఝులిపించాల్సి ఉంది. తనదైన రోజున రీచా ఘోష్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండగా, ఆల్‌రౌండర్ దీప్తిశర్మ బ్యాటింగ్‌లో ఆకట్టుకోవాల్సి ఉంది. బుధవారం జరిగే ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ తలపడనున్నాయి.