Champions Trophy | దుబాయ్: పాకిస్థాన్‌లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై సందిగ్ధత కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం పాక్ వేదికగా వచ్చే ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాము పాక్‌లో పర్యటించలేమంటూ భారత్ స్పష్టం చేయడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శుక్రవారం వర్చువల్‌గా జరిగిన ఐసీసీ భేటీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వాలంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాల్సిందేనని, ఒకవేళ ససేమిరా అంటే ఆతిథ్యానికి వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. దుబాయ్‌లో జరిగిన ఈ అత్యవసర భేటీలో పీసీబీ చీఫ్ మోహిసిన్ నఖ్వి స్వయంగా హాజరయ్యాడు.
‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఇందుకు అంగీకరిస్తే..భారత్ ఆడే చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయి. ఇదే జరిగితే బ్రాడ్కాస్టర్లు ఐసీసీకి ఒక్క రూపాయి కూడాఇవ్వరు. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ఓకే అంటేనే శనివారం భేటీ జరుగుతుంది. లేకుంటే మొత్తానికి మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలించి వేరే దేశంలో నిర్వహిస్తుంది’ అని ఐసీసీ సభ్యుడొకరు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న జై షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు అందుకోబోతున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని ఇది వరకే బీసీసీఐ స్పష్టం చేయగా తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌లో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళనలో ఉంది. మేం దీనిని పరిగణనలోకి తీసుకున్నాం. భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదు’ అని స్పష్టం చేశారు.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ పీసీబీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తమ దేశానికి చెందిన క్రికెటర్లెవరూ పాల్గొనవద్దని, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ దేశ ఆటగాళ్లను హెచ్చరించింది. పీఎస్ఎల్లో ఆడేందుకు తాము నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్స్ (ఎన్వోసీ) మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. ఏప్రిల్-జులై మధ్య ఇంగ్లండ్‌లో దేశవాళీ సీజన్ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో క్రికెటర్లందరూ కచ్చితంగా దేశవాళీ సీజన్లో ఆడాలని తెలిపింది.