ఓవల్: ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ తడబాటుకు గురైంది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్లు కట్టడిచేయడంతో టీమ్ఇండియా ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పలుమార్లు వర్షం అంతరాయం కల్గించిన మ్యాచ్‌లో 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (98 బంతుల్లో 52 నాటౌట్, 7 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించగా సాయి సుదర్శన్ (108 బంతుల్లో 38, 6 ఫోర్లు) భారత్‌ను ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ (2/31) జోష్ టంగ్ (2/47) తలా రెండు వికెట్లు తీయగా వోక్స్ ఒక వికెట్ తీశాడు.
ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. తొలి సెషన్ నుంచే ఇబ్బందులు ఎదుర్కుంది. పిచ్‌పై ఉన్న పచ్చికతో పాటు మబ్బులు పట్టి ఉన్న వాతావరణాన్ని వినియోగించుకుంటూ ఇంగ్లిష్ పేసర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో భారత్‌కు పరుగుల రాక గగనమైంది. అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. మూడో స్థానంలో వచ్చిన సాయితో కలిసి రాహుల్ (14).. ఆచితూచి ఆడాడు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత వోక్స్ ఓవర్లో రాహుల్.. బంతిని కట్ చేయబోయి వికెట్ల మీదకు ఆడుకోవడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ క్రమంలో సాయితో జతకలిసిన గిల్(21)… భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. లంచ్ విరామానికి రెండు ఓవర్ల ముందు ఓవల్‌ను వర్షం ముంచెత్తింది. కొద్దిసేసటి తర్వాత వాన ఆగినా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో సుమారు రెండు గంటల పాటు ఆట నిలిచిపోయింది.
విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఆటలో భారత్‌కు అట్కిన్సన్ మరో షాకిచ్చాడు. అతడు వేసిన 28వ ఓవర్లో రెండో బంతిని గిల్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ దిశగా ఆడాడు. నాన్ ైస్టెకర్ ఎండ్‌లో సాయి వద్దని వారించినా గిల్ సింగిల్ తీసేందుకు యత్నించి దాదాపు సగం క్రీజు దాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లబోయాడు. కానీ అప్పటికే బంతినందుకున్న అట్కిన్సన్.. నేరుగా వికెట్లను గురిచూసి కొట్టడంతో భారత సారథి నిరాశగా వెనుదిరిగాడు. గిల్ ఔటైన తర్వాత పది బంతులకే మళ్లీ వర్షం ప్రారంభమైంది.
టీ తర్వాత ఆట పున:ప్రారంభమవగా శార్దూల్ స్థానంలో జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట సాయితో కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్న అతడు.. వాషింగ్టన్ (19 నాటౌట్)తో అజేయమైన ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. క్రీజులో కుదురుకుని అర్ధ శతకం దిశగా సాగుతున్న సాయి.. టంగ్ 36వ ఓవర్లో కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ భారీ ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా (9) సైతం టంగ్ ఓవర్లో సాయి మాదిరిగానే కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ధ్రువ్ జురెల్ (19) కూడా వారిబాటే పట్టాడు. ఈ క్రమంలో మాంచెస్టర్ సెంచరీ హీరో వాషింగ్టన్, కరుణ్.. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి రోజును ముగించారు.
కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే గిల్ దిగ్గజాల సరసన నిలిచాడు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న భారత సారథి (743).. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత సారథిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (1978/79లో వెస్టిండీస్‌తో 732 రన్స్) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (2016/17లో ఇంగ్లండ్ పై 655) మూడో స్థానంలో ఉన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 64 ఓవర్లలో 204/6 (కరుణ్ 52*, సాయి 38, అట్కిన్సన్ 2/31, టంగ్ 2/47)