Womens World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో కీలక మ్యాచ్‌లకు రేపటితో తెరలేవనుంది. లీగ్ దశలో అదరగొట్టిన నాలుగు జట్లు ఇప్పుడు సెమీఫైనల్లో(Semi Final) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఇప్పటికే మాజీ ఛాంపియన్లుకాగా .. భారత్, దక్షిణాఫ్రికా తొలి కప్ కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నాయి. నాకౌట్ దశలో తిరుగులేని ఆసీస్, ఇంగ్లీష్ జట్లకు చెక్ పెడితే తప్ప కొత్త విజేతను చూడలేం. అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా ఉన్న ఈ రెండు జట్లకు టీమిండియా, సఫారీ టీమ్‌లు మట్టికరిపించాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఒకరిద్దరి మీద ఆధారపడకుండా సమిష్టిగా రాణించడం తప్ప మరో దారి లేదు.
వరల్డ్ కప్ అంటే చాలు.. ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీని తన్నుకపోవడం పరిపాటి అయింది. పురుషుల జట్టు మాత్రమే కాదు ఆ దేశపు ఆడ సింహాలు కూడా రికార్డు స్థాయిలో కప్‌ను తన్నుకుపోయాయి. ఎక్కడ టోర్నీ జరిగినా విజేతలం మేమే అన్నట్టుగా ఆసీస్ (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022, ) ఎనిమిదిసార్లు, ఇంగ్లండ్ జట్టు (1973, 1993, 2009, 2017) నాలుగుసార్లు ఛాంపియన్లు అయ్యాయి. ఈ రెండు జట్లను కాదని ఒకేఒకసారి 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ విశ్వవిజేతగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పదమూడో సీజన్లోనూ అలీసా హేలీ సారథ్యంలోని కంగారూ టీమ్అజేయంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లి తొమ్మిదోసారి విజేతగా నిలవాలనే కసితో ఉంది.
Semi-finals loading ⌛ pic.twitter.com/OilRkq6Be0
— ESPNcricinfo (@ESPNcricinfo) October 28, 2025
మరోవైపు చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి మినహా ఛాంపియన్ ఆటతో ఇంగ్లండ్ సెమీస్ బెర్తు దక్కించుకుంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, హీథర్ నైట్, అమీ జోన్స్ రాణిస్తుండగా.. స్పిన్నర్లు లిన్సే స్మిత్, డీన్స్, ఎకిల్‌స్టోన్ ఆ జట్టు విజయాల్లో కీలకం అవుతున్నారు. సెమీస్‌లోనూ విజయంతో ఐదో కప్ వేటకు మరింత చేరువవ్వాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లండ్. ఇక.. దక్షిణాఫ్రికా కథ వేరు. ఆరంభ పోరులోనే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక 69 పరుగులకే ఆలౌటయ్యింది సఫారీ టీమ్. అయితే.. మ్యాచ్ అనంతరం ‘మేము 69 ఆలౌట్ కన్నా ఎంతో మెరుగైనవాళ్లం’ అని చెప్పిన కెప్టెన్ లారా వొల్వార్డ్త్ ఊహించని విధంగా జట్టును సెమీస్ చేర్చింది. మిడిలార్డర్లలో చోలే ట్రయాన్, మరినే కాప్.. ఫినిషర్ డీక్లెర్క్ తుఫాన్ ఇన్నింగ్స్‌లకు తోడు.. స్పిన్నర్ మ్లాబా జోరుతో వరుసగా ఐదు విజయాలతో దర్జాగా నాకౌట్ పోరుకు అర్హత సాధించింది.
Which two teams will make the final? 💬 pic.twitter.com/rpnUqfKZar
— ESPNcricinfo (@ESPNcricinfo) October 28, 2025
చివరి లీగ్ మ్యాచ్‌లోనూ విజయంతో సెమీస్‌కు ఆత్మవిశ్వాసం కూడకట్టుకోవాలనుకున్న సఫారీల కథ ఆస్ట్రేలియాపై ఓటమితో మళ్లీ మొదటికి వచ్చింది. విశాఖపట్టణంలో భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో గెలుపొందిన లారా బృందం అదే వేదికపై ఒత్తిడికి తలొగ్గింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ అలనా కింగ్(7-218) ధాటికి 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం మూటగట్టుకుంది. మరి.. సెమీస్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చి తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? అనేది రేపటితో తెలిసిపోనుంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ ఆసాంతం దుమ్మురేపిన లరా బృందం.. చివరకు ఫైనల్లో మాత్రం కుదేలైంది. తొలిసారి పొట్టి ప్రపంచ కప్ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకుంది. అమేలియా కేర్ ఆల్‌రౌండ్ షోతో విజేతగా అవతరించిన న్యూజిలాండ్ తొలి కప్ కలను సాకారం చేసుకుంది.
వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండుసార్లు ఫైనల్ చేరిన భారత జట్టు.. ఆఖరి మెట్టుపై తడబడింది. మొదటిసారిగా 2005లో మిథాలీ రాజ్ సారథ్యంలో టీమిండియా టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. కానీ ఆస్ట్రేలియా ధాటికి రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. అనంతరం 2017లో ఫైనల్ చేరినా.. ఇంగ్లండ్‌ను నిలువరించలేక తొలిసారి కప్‌ను ఒడిసిపట్టే అవకాశం చేజార్చుకుంది. ఈసారి.. పుష్కర కాలం తర్వాత వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్ అతికష్టంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకోగా.. వరుణుడి దెబ్బకు శ్రీలంక ఆశలు ఆవిరయ్యాయి. ఆరంభ పోరులో లంకపై, అనంతరం పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీలతో జోరు చూపించిన టీమిండియా వరుస ఓటములతో వెనకబడింది. న్యూజిలాండ్‌తో చావోరేవో పోరులో ఓడితే ఇక సెమీస్ ఆశలు గల్లంతే అనుకున్నవేళ ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Manhdana), ప్రతీకా రావల్(Pratika Rawal)లు సెంచరీలతో చెలరేగారు. జెమీమా రోడ్రిగ్స్ మెరుపు అర్ధ శతకంతో భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేసి ఊపిరిపీల్చుకుంది.
Group stage complete ✅
Positives taken ✅
Special memories made 🥳#TeamIndia is 𝙨𝙚𝙢𝙞𝙨 𝙗𝙤𝙪𝙣𝙙 🇮🇳Get your #CWC25 tickets 🎟 now: https://t.co/vGzkkgwXt4#WomenInBlue | #INDvAUS pic.twitter.com/O3FYLR9pTt
— BCCI Women (@BCCIWomen) October 27, 2025
చివరి లీగ్ మ్యాచ్‌లో వర్షం పదేపదే అడ్డుపడినా బంగ్లాదేశ్‌ను వణికించారు బౌలర్లు. కానీ.. ఫీల్డింగ్ చేస్తుండగా ఓపెనర్ ప్రతీక కుడి కాలి మడిమ గాయంతో టోర్నీకి దూరమైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న తను కీలకమైన సెమీస్ ఆడకపోవడం హర్మన్‌ప్రీత్ సేనకు గట్టి ఎదురుదెబ్బే. ఎందుకంటే.. ఆస్ట్రేలియాపై వైజాగ్‌లో మంధానతో కలిసి అర్ధ శతకం బాదేసిన ప్రతీక మరో పెద్ద ఇన్నింగ్స్ ఆడుతుందని అభిమానులు ఆశించగా నిరాశే మిగిలింది. ఆమె స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన షఫాలీ వర్మకు ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రతీక రావడానికి ముందునుంచే మంధానతో ఇన్నింగ్స్ ఆరంభించి.. శుభారంభాలు ఇచ్చిన ఈ లేడీ సెహ్వాగ్‌కు ఛాన్స్ ఇస్తే మాత్రం.. దూకుడుగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. 2017 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో ఆసీస్‌పై 171 నాటౌట్ (115 బంతుల్లో) శతకంతో విరుచుకుపడిన హర్మన్‌ప్రీత్ ఈసారి అలాంటి ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడడం చాలా ముఖ్యం.
UPDATE: Shafali Verma has joined #TeamIndia ahead of the Semi-final clash against Australia.
Details 🔽 #WomenInBlue | #CWC25 https://t.co/2IHl7ae6Vd
— BCCI Women (@BCCIWomen) October 28, 2025
అలానే.. మిడిలార్డర్లో హర్లీన్ డియోల్, జెమీమా, దీప్తి, రీచా ఘోష్‌లు బ్యాట్ ఝులిపిస్తేనే ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే స్కోర్ సాధ్యమవుతుంది. ఎనిమిదిసార్లు ఛాంపియన్ అయిన కంగారూ టీమ్‌ను ఓడించాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అలీసా హేలీని త్వరగా ఔట్ చేస్తే కొంతవరకూ ఆసీస్‌పై ఒత్తిడి పెంచవచ్చు. అయితే.. ఇప్పటికే రెండు శతకాలు బాదేసిన అష్ గార్డ్నర్, పాక్‌పై దంచేసిన బేత్ మూనీలను పవర్ ప్లేలోనే ఔట్ చేయడానికి రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ వ్యూహాలు పన్నాల్సిందే. అలానే డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడం చాలా ముఖ్యం. సెమీస్ ఫలితంతోనే కొత్త ఛాంపియన్ అవతరించేనా? లేదా? అనేది ఖాయమైతుంది. అందుకే.. ఆసీస్, ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండికొడుతూ.. భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ చేరాలని యావత్ క్రీడాలోకం కోరుకుంటోంది. అదే జరిగితే.. ఈసారి విశ్వ విజేతగా కొత్త టీమ్‌ను చూస్తాం.