ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానం కొల్లగొట్టింది. వార్షిక వన్డే ర్యాంకింగ్స్(ODI Team Rankings)లో టీమిండియా అత్యధికంగా పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది. రేటింగ్ కొద్దిగా తగ్గినప్పటికీ 118 పాయింట్లతో శుభ్మన్ గిల్(Shubman Gill) సేనకు తొలి ర్యాంక్ సొంతమైంది. తద్వారా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ పోటీలకు భారత్ నేరుగా అర్హత సాధించనుంది.
వార్షిక వన్డే ర్యాంకింగ్స్ కోసం ఐసీసీ కీలక అంశాలపై దృష్టి సారించింది. నిరుడు మే నుంచి ఆడిన మ్యాచ్లకు వంద శాతం.. గత రెండు ఏళ్లలో సాధించిన విజయాలకు యాభై శాతం ప్రాధాన్యం ఇస్తూ ర్యాంకింగ్స్ ప్రకటించింది ఐసీసీ. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానం సాధించింది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి అని ఐసీసీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Key ramifications for the @cricketworldcup 2027 qualifications in the annual ICC Men’s ODI Team Rankings update 👀https://t.co/2xMlGGRUcN
— ICC (@ICC) May 11, 2026
గత రెండేళ్లలో వన్డే క్రికెట్లో అదరగొడుతున్న న్యూజిలాండ్(113 పాయింట్లు), ఆస్ట్రేలియా(109 పాయింట్లు) రెండు, మూడు ర్యాంకులో నిలిచాయి. దక్షిణాఫ్రికా జట్టు 102 పాయింట్లతో నాలుగులో.. పాకిస్థాన్ 98 పాయింట్లతో ఐదో ర్యాంక్ సాధించాయి. శ్రీలంక, అఫ్గనిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. అయితే.. వీటిలో ఎనిమిది ర్యాంకులోని జట్లన్నీ నేరుగా వన్డే ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించనున్నాయి.