రాజ్‌గిర్ (బీహార్): ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన పూల్ ‘ఏ’ రెండో మ్యాచ్‌లో భారత్.. 3-2తో జపాన్ను చిత్తు చేసి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్ (చైనాతో)లో హ్యాట్రిక్ గోల్స్‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి రెండు గోల్స్ (5వ నిమిషం, 46వ ని.) చేసి జట్టును ముందుండి నడిపించాడు. మన్దీప్ సింగ్ (4వ ని.) ఒక గోల్ కొట్టాడు. జపాన్ తరఫున కొసె కవాబె (38, 58 ని.) రెండు గోల్స్ చేశాడు. ఈ విజయంతో పూల్ ‘ఏ’లో ఆరు పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలువగా జపాన్, చైనా తలా ఒక విజయంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సేన సోమవారం కజకిస్థాన్‌తో తలపడనుంది.
చైనాతో మ్యాచ్ కంటే రెండో పోరులో భారత ఆట మెరుగైంది. ఫీల్డ్‌లో ఆటగాళ్ల మధ్య సమన్వయంతో పాటు ప్రత్యర్థిపై దూకుడుగా ఆడుతూ వారిని ఒత్తిడిలోకి నెట్టడంలో మనోళ్లు విజయం సాధించారు. ఆట తొలి క్వార్టర్ నుంచే భారత్.. జపాన్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్‌పోస్ట్ వద్దకు వెళ్లింది. రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి 2-0 ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో నిమిషంలో మన్దీప్ సింగ్.. జపాన్ డిఫెండర్లను, గోల్ కీపర్‌ను ఛేదించి తొలి గోల్ కొట్టాడు. ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచాడు.
తొలి క్వార్టర్ ముగింపులో జపాన్‌కు పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చినా భారత గోల్ కీపర్ కృష్ణన్ బహదూర్ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లుతూ అద్భుతంగా బంతిని ఆపాడు. రెండో క్వార్టర్లోనూ జపాన్‌కు రెండుసార్లు పెనాల్టీ కార్నర్లు లభించినా ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. అయితే మూడో క్వార్టర్లో కవాబె.. కైటొ తనాక అందించిన పాస్‌ను సద్వినియోగం చేసుకుని తొలి గోల్ సాధించాడు. కానీ కొద్దిసేపటికే హర్మన్‌ప్రీత్ పవర్ఫుల్ లో ఫ్లిక్‌తో భారత ఆధిక్యాన్ని 3-1కు పెంచాడు. ఆఖర్లో జపాన్‌కు మరో గోల్ దక్కినా అది భారత ఆధిక్యాన్ని తగ్గించిందే తప్ప ఆ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయింది.
తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడినా టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైనా రెచ్చిపోయింది. ఆదివారం ఆ జట్టు 13-1తో కజకిస్థాన్‌పై భారీ విజయాన్ని నమోదుచేసింది. చైనా ఆటగాళ్లలో యునాలిన్ లు మూడు గోల్స్ కొట్టగా.. డు షిహావొ, లిన్, బెన్హయ్ చెన్, తలా రెండు గోల్స్ చేసి చైనాకు భారీ విజయాన్ని అందించారు.