లండన్ : క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో జరిగిన చరిత్రాత్మక టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి మహిళల టెస్టుకు ఆతిథ్యమిచ్చిన లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు విజయాన్ని నమోదుచేశారు. భారత్ నిర్దేశించిన 457 పరుగుల ఛేదనలో ఇంగ్లిష్ జట్టు 186 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండువారాల క్రితమే ఇదే వేదికపై ఆస్ట్రేలియా చేతిలో టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓడిన ఆతిథ్య జట్టుకు ఇది మరో షాక్. సోమవారం, ఆట ఆఖరిరోజు సోఫీ ఎకిల్‌స్టోన్ (50) కొద్దిసేపు పోరాడగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు కథ లంచ్‌లోపే ముగిసింది. స్నేహ్ రాణా (4/42) నాలుగు వికెట్లు పడగొట్టగా సయాలి సత్ఘారే (2/24), క్రాంతి గౌడ్ (2/54), దీప్తి శర్మ (2/36) తలా రెండు వికెట్లు తీసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ టాపార్డర్ పనిపట్టిన క్రాంతికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 130/6తో వచ్చిన నాట్ సివర్ సేన పెద్దగా పోరాడకుండానే చేతులెత్తేసింది. ఎకిల్‌స్టోన్ కాస్త ప్రతిఘటించినా భారత బౌలర్లు గంటన్నర లోపే ఆ జట్టు కథ ముగించారు. నాలుగో రోజు మూడో ఓవర్లోనే రాణా.. అమీ జోన్స్ (54)ను ఔట్ చేసింది. వ్యక్తిగత స్కోరు 8, 16 పరుగుల వద్ద ఉండగా ఎకిల్‌స్టోన్ ఇచ్చిన క్యాచ్‌లను రాణా, యస్తికా వదిలేయడంతో బతికిపోయిన ఆమె ఇన్నింగ్స్ ఆఖరిదాకా నిలిచింది. కానీ దీప్తి.. ఇసీ వాంగ్ (1), లారెన్ బెల్‌ను బౌల్డ్ చేసి ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. రాణా వేసిన 63వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ క్లీన్‌బౌల్డ్ అవడంతో భారత విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఇంగ్లిష్ గడ్డపై ఓటమెరుగని రికార్డును (పది టెస్టుల్లో) భారత్ కొనసాగించినైట్టెంది. కాగా ఇంగ్లండ్‌తో ఆడిన 16 టెస్టుల్లో టీమిండియాకు ఇది నాలుగో విజయం. 11 టెస్టులు డ్రాగా ముగియగా ఒకదాంటో ఓడింది.
1 మహిళల టెస్టుల్లో మూడు లేదా నాలుగు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్ యస్తికా. ఇక లార్డ్స్‌లో సెంచరీ కొట్టిన తొలి మహిళగానూ రికార్డు సృష్టించింది.
2 టెస్టుల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇది రెండో పెద్ద విజయం. గతంలో ఇదే జట్టుపై 347 రన్స్ తేడాతో గెలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఇది నాలుగో అత్యుత్తమం.
3 టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనచేసిన భారత మూడో బౌలర్ క్రాంతి (7/91). జులన్ (2006లో ఇంగ్లండ్‌పై10/78), శశి గుప్తా (1984లో ఆస్ట్రేలియాపై 8/100) టాప్-2లో ఉన్నారు.
4 కపిల్ దేవ్ (1986), ఎంఎస్ ధోనీ (2014), విరాట్ కోహ్లీ (2021) తర్వాత లార్డ్స్‌లో టెస్టు గెలిచిన భారత నాలుగో సారథి హర్మన్‌ప్రీత్.
భారత్ తొలి ఇన్నింగ్స్: 285 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 170 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 341/7; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం:457) : 186 ఆలౌట్ (అమీ 54, ఎకిల్‌స్టోన్ 50, స్నేహ్ 4/42, సయాలి 2/24)