Team India | కటక్ : టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత్.. 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (52 బంతుల్లో 60, 9 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44, 3 ఫోర్లు, 1 సిక్స్) మెరవడంతో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్.. మరో 33 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు తరఫున జో రూట్ (72 బంతుల్లో 69, 6 ఫోర్లు), బెన్ డకెట్ (56 బంతుల్లో 65, 10 ఫోర్లు), లివింగ్స్టన్ (32 బంతుల్లో 41, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రవీంద్ర జడేజా (3/35) బట్లర్ సేనను మరోసారి తన స్పిన్‌తో కట్టడి చేశాడు. రోహిత్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గిల్, కోహ్లీ ఔట్ అయినా రోహిత్ దూకుడు తగ్గలేదు. అప్పటికే 80లలోకి వచ్చిన అతడికి శ్రేయస్ తోడవంతో భారత్ గెలుపు దిశగా మరింత వేగంగా దూసుకెళ్లింది. వుడ్ 23వ ఓవర్లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది 90లలోకి చేరిన హిట్‌మ్యాన్.. రషీద్ 26 ఓవర్లో రెండో బంతిని ముందుకొచ్చి లాంగాఫ్‌లో సిక్సర్‌గా మలిచి తన కెరీర్లో 32వ శతకాన్ని నమోదుచేశాడు. 76 బంతుల్లోనే అతడి శతకం పూర్తయింది. గత వన్డేలో దూకుడుగా ఆడిన అయ్యర్.. కటక్‌లోనూ అదే జోరు కనబరిచాడు. వుడ్ 29 ఓవర్లో 4, 4, 6 బాదాడు. లివింగ్స్టన్ 30వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి షార్ట్ మిడ్‌వికెట్ వద్ద రషీద్ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. నాలుగో వికెట్‌కు రోహిత్, అయ్యర్ 70 పరుగులు జోడించారు. రోహిత్ నిష్క్రమించేటప్పటికే భారత్ విజయం దాదాపుగా ఖరారైంది. అయ్యర్ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ (10), హర్దిక్ (10) నిరాశపరిచినా అక్షర్ పటేల్ (41 నాటౌట్), జడేజా (11 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టాపార్డర్ అదరగొట్టడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ ద్వయం డకెట్, సాల్ట్ (26) ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా డకెట్ అయితే బౌండరీలతో రెచ్చిపోయాడు. హర్షిత్, షమీ, హార్దిక్ బౌలింగ్‌లో ఓవర్‌కు రెండు ఫోర్లకు తక్కువ కాకుండా బాదాడు. డకెట్ దూకుడుతో షమీ (1/66), రాణా (1/62), పాండ్యా (1/53) భారీగా పరుగులిచ్చుకున్నారు. అయితే కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న వరుణ్ చక్రవర్తి.. 11వ ఓవర్లో సాల్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్‌నిచ్చాడు. ఇదే ఓవర్లో బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తిచేసి ప్రమాకరంగా మారిన డకెట్‌ను 16వ ఓవర్లో జడేజా ఔట్ చేయడంతో రోహిత్ సేన ఊపిరి పీల్చుకుంది. స్పిన్నర్ల రంగప్రవేశంతో ఇంగ్లండ్ స్కోరు వేగం కూడా కాస్త నెమ్మదించింది. డకెట్ నిష్క్రమించినా రూట్, బ్రూక్ (31) కలిసి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. బ్రూక్‌ను రాణా బోల్తా కొట్టించాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న రూట్.. కెప్టెన్ జోస్ బట్లర్ (34) తో కలిసి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. బట్లర్‌ను హార్దిక్ వెనక్కిపంపగా అర్ధ సెంచరీ తర్వాత రూట్ మరోసారి జడ్డూ మాయకు బలవడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో లివింగ్స్టన్ మెరుపులతో ఆ జట్టు 300 పరుగుల మార్కును దాటింది.
ఇటీవల కాలంలో పేలవ ఫామ్‌తో సతమతమవుతూ ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న రోహిత్.. క్రీజులో కుదురుకుంటే తాను ఎంత ప్రమాదకర బ్యాటరో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఛేదనలో ఒత్తిడి ఉన్నా కటక్‌లో హిట్‌మ్యాన్ తనదైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు. ఇంగ్లండ్ అగ్రశ్రేణి బౌలర్లను క్లబ్ బౌలర్లుగా మార్చుతూ కటక్‌లో ఇంగ్లీష్ బౌలర్లతో కథాకళి ఆడించాడు. అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో 4, 6తో పరుగుల వేటను మొదలుపెట్టిన అతడి దూకుడు ఇన్నింగ్స్ ఆసాంతం కొనసాగింది. సకిబ్ మూడో ఓవర్లో రెండో బంతిని కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టిన కెప్టెన్.. అతడే వేసిన 5వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా మరో భారీ షాట్ బాదాడు. భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లు మొరాయిండచంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. కానీ ఇదేమీ రోహిత్ ఏకాగ్రతను దెబ్బతీయలేదు. ఆ తర్వాత అతడి పరుగుల వేట మరింత పెరిగింది. వుడ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అతడు.. రషీద్ 9వ ఓవర్ల రెండు బౌండరీలతో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. మరో ఎండ్‌లో గిల్ కూడా నాయకుడి అండతో రెచ్చిపోయాడు. రషీద్ ఓవర్లో స్లాగ్ స్వీప్‌తో సిక్సర్ కొట్టిన ఈ పంజాబ్ కుర్రాడు అతడే వేసిన 15వ ఓవర్లో రెండు బౌండరీలతో తన కెరీర్లో 15వ అర్ధ శతకాన్ని సాధించాడు. వీళ్లిద్దరి దూకుడుతో 16 ఓవర్లకే భారత స్కోరు వికెట్ నష్టపోకుండా 127 పరుగులుగా నమోదైంది. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన ఓవర్టన్.. గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 136 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (5) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
2 వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు సాధించిన రెండో ఆటగాడు రోహిత్ (338). గేల్ (331) రికార్డును అతడు అధిగమించాడు. అఫ్రిది (351) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్: 49.5 ఓవర్లలో 304 ఆలౌట్ (రూట్ 69, డకెట్ 65, జడేజా 3/35, హార్దిక్ 1/53);
భారత్: 44.3 ఓవర్లలో 308/6 (రోహిత్ 119, గిల్ 60, ఓవర్టన్ 2/27, లివింగ్స్టన్ 1/29)