బ్యాంకాక్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి పోరులో కెనడాను చిత్తు చేసిన పీవీ సింధు బృందం.. మంగళవారం పోరులో 4-1తో అమెరికాపై విజయం సాధించింది. గ్రూప్-‘డి’లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్.. పట్టికలో అగ్రస్థానంతో నాకౌట్‌కు అర్హత సాధించింది. తొలి ‘టై’లో స్టార్ షట్లర్ సింధు 21-10, 21-11తో జెన్నీపై విజయం సాధించగా.. డబుల్స్ జోడీ త్రిసా జాలీ-తనీషా 21-19, 21-10తో ఫ్రాన్సెస్కా-అలీసన్ జంటపై గెలిచి ఆధిక్యాన్ని డబుల్ చేసింది. రెండో సింగిల్స్ పోరులో ఆకర్శి కశ్యప్ 21-18, 21-11తో ఎస్తర్పై నెగ్గడంతో భారత్ 3-0తో విజయం సాధించగా.. యువ డబుల్స్ జోడీ సిమ్రన్-రితిక ఓటమి పాలైంది. ఆఖరి పోరులో అశ్మిత చలిహ 21-18, 21-13తో నటాలియాపై విజయం సాధించింది. ఉబర్ కప్‌లో ఇప్పటి వరకు రెండు సార్లు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు.. బుధవారం జరుగనున్న నామమాత్ర పోరులో కొరియాను ఢీకొట్టనుంది. మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు కూడా వరుస విజయాలతో నాకౌట్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.