Arjun Erigaisi | ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ విజయ పతాక ఎగురవేసింది. హంగరీ దేశాన మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన ఒలింపియాడ్‌లో పసిడి పతక ధమాకాతో కొత్త చరిత్ర లిఖించింది. ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు కైవసం చేసుకుని భారత్ సత్తాచాటింది. ఈ చారిత్రక విజయంలో మన తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. దేశానికి పసిడి పతకం అందించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఓరుగల్లు ముద్దుబిడ్డ అనుకున్నది సాధించాడు.
వరుస విజయాలతో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తూ చిరకాల కలను సాకారం చేయడంలో కీలకమయ్యాడు. రౌండ్ రౌండ్‌కు గెలుపు వాడిని పెంచుకుంటూ పోయిన అర్జున్ వ్యక్తిగత స్వర్ణం సహా టీమ్ ఈవెంట్లో పసిడి కొల్లగొట్టి ఔరా అనిపించాడు. ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ భారత్‌ను గెలుపు సంబురాల్లో ముంచెత్తిన అర్జున్ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు పంచుకున్నాడు.
సుదీర్ఘ చరిత్ర కల్గిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. మేము ప్రాతినిధ్యం వహించిన ఓపెన్ విభాగంతో పాటు మహిళల కేటగిరీలోనూ భారత్ పసిడి పతకాలతో మెరువడం మరిచిపోలేనిది. ఇప్పటి వరకు సాధ్యపడని డబుల్ ధమాకా(రెండు స్వర్ణాలు) ప్రదర్శన ఇన్నేండ్లకు సాధ్యపడింది. టోర్నీ ఆసాంతం ప్లేయర్లందరూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో ముందుకుసాగుతూ ట్రోఫీ కైవసం చేసుకున్నాం.
ఒలింపిక్స్‌కు సమానంగా భావించే చెస్ ఒలింపియాడ్‌లో టోర్నీకి ముందు నాపై పెద్దగా అంచనాలేమి లేవు. అదీ నా విజయానికి కారణమైందని చెప్పొచ్చు. చెస్ ఒలింపియాడ్ కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టలేదు. సాధారణ టోర్నీల్లాగే బరిలోకి దిగాను. కానీ ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న లక్ష్యాన్ని మనసులో అనుకున్నాను. ఇలా చేయడం వలన ఒత్తిడి దరిచేరకుండా చేయవచ్చన్న ఆత్మవిశ్వాసంతో సాగడం కలిసివచ్చింది.
ఇన్నేండ్ల నా కెరీర్లో దక్కిన అపూర్వ విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నాను. నాపై పెట్టుకున్న అంచనాలను వమ్ముచేయకుండా జట్టు విజయంలో కీలకమైనందుకు సంతోషంగా ఉంది. జట్టు వ్యూహాల్లో భాగంగా నేను, గుకేశ్ ప్రత్యర్థుల ఎత్తులకు చిక్కకుండా ముందుకు సాగాం. ముందే నిర్దేశించుకున్న వ్యూహం ప్రకారం గుకేశ్ తొలి బోర్డులో ఆడితే నేను మూడో బోర్డులో పోటీకి దిగడం కలిసివచ్చింది. టోర్నీ తొలి రౌండ్లలో ఒకింత తడబడినా..ప్రత్యర్థులకు తలొగ్గలేదు. ఆడిన 11 రౌండ్లలో 10 పాయింట్లతో టాప్‌లో నిలిచినందుకు గర్వంగా ఉంది. మొత్తం 11 రౌండ్లలో తొమ్మిది విజయాలు రెండు డ్రాలు ఎదుర్కొన్నాను. డ్రా అయిన రెండింటిలో గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాను.
టోర్నీ మొత్తమ్మీద అమెరికాతో జరిగిన 10వ రౌండ్ పోరు హోరాహోరీగా సాగింది. స్వర్ణం సాధించాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో మన ప్లేయర్లు సత్తాచాటారు. తొలుత ఫాబియానో కరువానపై గుకేశ్ గెలువడం కలిసొచ్చింది. అయితే వెస్లీ చేతిలో ప్రజ్ఞానంద ఓడిపోవడం, లెవాన్ ఆరోనియాన్తో విదిత్ గుజరాతి గేమ్ డ్రా చేసుకోవడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కీలకమైన ఆఖరి పోరులో నేను డోమింగెజ్ పెరెజ్‌పై గెలువడంతో భారత్ 2.5-1.5తో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో మరో రౌండ్ మిగిలుండగానే 19 పాయింట్లతో టాప్‌లోకి దూసుకొచ్చాం. చివరిదైన 11 రౌండ్లో స్లోవేనియాపై 3.5-0.5తో విజయంతో స్వర్ణం మన ఖాతాలో చేరింది.
టోర్నీలో మాతో పాటు మహిళల విభాగంలోనూ స్వర్ణం దక్కడం చారిత్రక సందర్భం. ద్రోణవల్లి హారిక లాంటి సీనియర్లకు తోడు వంతిక అగర్వాల్, దివ్యాదేశ్ముఖ్, తానియా సచ్దేవ్, వైశాలి అద్భుత ప్రదర్శన కనబరిచారు.
నాకంటూ సుదీర్ఘమైన లక్ష్యాలేమి లేవు. టోర్నీకి టోర్నీకి ప్రాధాన్యం మారుతూ ఉంటుంది. అక్టోబర్‌లో లండన్ వేదికగా గ్లోబల్ చెస్ లీగ్ జరుగబోతున్నది. ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహించే లీగ్‌లో ఆడబోతు ఇదో వైవిధ్యమైన టోర్నీ. వివిధ దేశాల ప్లేయర్లతో కలిసి ఆడటం కొత్త అనుభూతిని ఇస్తుంది.