దుబాయ్: ఆట కంటే ఆటేతర విషయాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కప్ ముగింపు కూడా వివాదాస్పదం అయింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హోరాహోరీగా ముగిసిన ఫైనల్ అనంతరం విజేతల (టీమ్ఇండియా)కు అందజేయాల్సిన ట్రోఫీ ప్రధానోత్సవం.. అలాంటిదేమీ లేకుండానే ముగిసింది. టోర్నీలో పాక్‌తో గ్రూప్, సూపర్-4 దశల్లో జరిగిన మ్యాచ్‌లలో ‘నో షేక్‌హ్యాండ్’ విధానాన్ని అవలంభించిన భారత్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించడంతో ఆదివారం అర్ధరాత్రి దుబాయ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఫైనల్ మ్యాచ్ ముగిసి సుమారు గంటన్నర దాటినా ట్రోఫీ బహుకరణ కార్యక్రమమేదీ నిర్వహించకపోవడంతో భారత అభిమానులు అయోమయానికి గురయ్యారు. అసలు ఈ కార్యక్రమం ఉంటుందా? ఉండదా? అన్న మీమాంసలో ఉండగా ఏసీసీ.. నఖ్వీతో పాటు తమ ప్రతినిధులను వేదికమీదకు పిలువగా పక్కనే ఉన్న భారత జట్టు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించింది. అయితే దీనిపై బీసీసీఐ.. ఏసీసీకి ముందే సమాచారం (నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీని తీసుకోబోమని) ఇచ్చినట్టు తెలుస్తున్నది. వేదికపై కొంతసేపు వేచి చూసిన నఖ్వీతో పాటు పలువురు ఏసీసీ ప్రతినిధులు ట్రోఫీని తీసుకుని వెళ్లిపోయారు. దీంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీని తీసుకోవడాన్ని నిరాకరించామే తప్ప ట్రోఫీని కాదని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏసీసీ చైర్మన్ నుంచి ట్రోఫీని తీసుకోకూడదని మేం ముందే నిశ్చయించుకున్నాం. పాక్ ప్రభుత్వంలో ఆయన నాయకుడు. ఆయనతో వేదిక పంచుకోవడం జరుగదు. అయితే ఆయన చేతులమీదుగా ట్రోఫీని వద్దంటున్నామంటే ట్రోఫీని వద్దని కాదు. దానిని ఆయన తనతో పాటు తీసుకెళ్లే హక్కు లేదు. ఇది చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది. ఏసీసీ చైర్మన్ భారత్‌కు ట్రోఫీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ట్రోఫీని, ఆటగాళ్లకు ఇచ్చే మెడల్స్‌ను తన హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. దీనిపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపాడు.
ఈ వివాదంపై కెప్టెన్ సూర్య స్పందిస్తూ.. ‘నా జీవితంలో ఇలా జరుగడం ఇదే తొలిసారి. చాంపియన్‌గా నిలిచిన జట్టు ట్రోఫీని అందుకోకపోవడం నేను నా కెరీర్లో ఇప్పటిదాకా చూడలేదు. చాలా కష్టపడి మేం ట్రోఫీని సాధించాం. అయితే నాతో పాటు మరో 14 ట్రోఫీలు (ఆటగాళ్లను ఉద్దేశిస్తూ) డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. అవే నిజమైన ట్రోఫీలు’ అని చెప్పాడు.
పాక్ సారథి సల్మాన్ అలీ అఘా స్పందిస్తూ.. ‘టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అతడు (సూర్య) నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. టోర్నీ ఆరంభ ప్రెస్‌మీట్‌తో పాటు రిఫరీ మీటింగ్‌లోనూ చేయి కలిపాడు. కానీ కెమెరాల ముందు మాత్రం అందుకు నిరాకరిస్తూ ధ్వంధ్వ విధానాలను అవలంభిస్తున్నాడు. నాకు తెలిసి అతడు ఎవరో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నట్టు ఉన్నాడు. ఇక ఈరోజు జరిగింది (ట్రోఫీ తీసుకోకపోవడం) దురదృష్టకరం. విజేతలకు ఏసీసీ అధ్యక్షుడే ట్రోఫీని అందిస్తాడు. అతడి నుంచి తీసుకోకుంటే మీకు ట్రోఫీ ఎలా వస్తుంది?’ అని వ్యాఖ్యానించాడు.