షెన్జెన్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించగా, స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-14, 21-14తో చైనా జోడీ రెన్ జింగ్ యు, జీ హనోన్పై అలవోక విజయం సాధించింది. 38 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఎనిమిదో సీడ్ సాత్విక్, చిరాగ్ జంట వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఇటీవల నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ఈ ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జోడీ..చైనీస్ షట్లర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
కండ్లు చెదిరే స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్, డ్రాప్షాట్లతో భారత యువ జంట టైటిల్‌కు మరో రెండడుగుల దూరంలో నిలిచింది. సెమీస్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వు యిక్‌తో సాత్విక్, చిరాగ్ తలపడుతారు. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 14-21, 13-21తో ఒలింపిక్ చాంపియ అన్ సె సంగ్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. 38 నిమిషాల్లోనే ముగిసిన పోరులో అన్‌సీడెడ్ సింధు..టాప్‌సీడ్ సంగ్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.