గ్వాంగ్జు(దక్షిణకొరియా): ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గత రికార్డులను తిరుగరాస్తూ పురుషుల కాంపౌండ్ టీమ్ అదరగొట్టింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో రిశబ్ యాదవ్, అమన్ సైనీ, పార్థమేశ్తో కూడిన భారత త్రయం 235-233 తేడాతో ఫ్రాన్స్ టీమ్(నికోలస్ గిరార్డ్, జీన్ ఫిలిపి, ఫ్రాన్కోసిస్)పై గెలిచి పసిడి పతకంతో మెరిసింది. టోర్నీ చర్రితలో భారత పురుషుల టీమ్ తొలిసారి స్వర్ణాన్ని సగర్వంగా ముద్దాడింది. చివరి వరకు గెలుపు దోబూచులాడిన పసిడి పతక పోరులో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా భారత్ తరఫున తక్కువ ర్యాంక్‌తో బరిలోకి దిగిన పార్థమేశ్ అంచనాలకు మించి రాణించాడు.
తొలి రౌండ్లో రెండు బాణాలతో తొమ్మిదేసి పాయింట్లు స్కోరు చేసిన 22 ఏండ్ల పార్థమేశ్ ఆ తర్వాత వరుసగా ఆరుసార్లు చెక్కుచెదరని గురితో పదేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివరి వరుసలో పార్థమేశ్ విల్లు నుంచి వెళ్లిన బాణంతో భారత్ చిరస్మరణీయ విజయం ఖరారైంది. పసిడి గెలిచిన తర్వాత భారత కాంపౌండ్ చీఫ్ కోచ్ జివన్జ్యోత్సింగ్ మాట్లాడుతూ ‘ఈ విజయం మా అందరిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జట్టులోని ప్రతీ సభ్యుడు అద్భుతంగా రాణించారు. తొలి రౌండ్లో 57-59తో వెనుకంజలో ఉన్నా..ఆ తర్వాత ఆరుసార్లు 10 పాయింట్లు దక్కడంతో స్కోరు 117తో సమమైంది.
ఆఖరిదైన మూడో రౌండ్లో 59 పాయింట్లతో 176-176 స్కోరు దగ్గర పార్థమేశ్ గోల్‌తో భారత్ విజయం వైపు నిలిచింది’ అని అన్నారు. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో భారత ద్వయం వెన్నెం జ్యోతి సురేఖ, రిశబ్ యాదవ్ 155-157 తేడాతో నెదర్లాండ్స్ జోడీ మైక్ షోలెసర్, సానె డీ లాట్ చేతిలో ఓడి రజతం కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అదే జోరు కొనసాగించలేకపోయారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగి 2017 తర్వాత తొలిసారి పతకం సాధించకుండానే టోర్నీని పేలవంగా ముగించింది.