Team India | స్వదేశంలో టెస్టుల్లో భారత జట్టు ఆధిపత్యం తగ్గుతున్నది. ఇటీవల వరుస సిరీస్‌లో ఓటమిపాలైంది. తాజాగా పిచ్‌లపై దేశీయంగా, విదేశాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన టెస్ట్‌లో భారత జట్టు టర్నింగ్ పిచ్‌ను సిద్ధం చేసింది. స్పిన్‌తో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను బోల్తా కట్టించాలనుకున్న టీమిండియా వ్యూహం బెడిసికొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయి ఓటమిపాలైంది. అయితే, భారత వికెట్లపై ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ స్పందించారు.
తొలిరోజు నుంచే తీవ్రమైన టర్న్ ఇస్తున్న ఇలాంటి పిచ్‌లు భారత్‌కే ఇబ్బందులు తెస్తాయన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన ఈడెన్ టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్న హీలీ.. స్వదేశంలో బ్యాటర్లు సైతం నిలబడలేని వికెట్లు సిద్ధం చేయడం భారత వ్యూహంలో లోపంగా అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి పిచ్‌లపై ఆడటం ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా కష్టం. చిన్నప్పటి నుంచే స్పిన్ పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లకే ఇప్పుడు సవాలుగా మారుతోంది. అప్పుడు ఇలాంటి తీవ్రమైన టర్నింగ్ వికెట్లు ఎందుకు?’ అంటూ ఆమె ప్రశ్నించారు. ‘విలో టాక్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హీలీ, నేటి క్రికెట్లో స్పిన్‌ను ఎదుర్కోవడం మరింత క్లిష్టమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ స్పిన్‌కు అతిగా సహకరించే పిచ్‌లు సిద్ధం చేస్తే, దాని ప్రభావం వారి జట్టుపైనే పడుతోందని ఆమె హెచ్చరించారు.
న్యూజిలాండ్‌తో జరిగిన టర్నింగ్ పిచ్‌లపై జరిగిన టెస్టుల్లో కూడా భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుర్తుచేసిన హీలీ.. ‘ఫ్లాట్ వికెట్లు ఉంటే భారత జట్టు వరుస పరాజయాల నుంచి బయటపడగలదు’ అని సూచించారు. అలాగే జడేజా, కుల్దీప్, వాషింగ్టన్, అక్షర్ వంటి భారత స్పిన్నర్లు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేసినప్పుడు మరింత ప్రమాదకరంగా ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు. ‘పిచ్ అతిగా తిరిగితే భారత స్పిన్నర్ల సహజ శైలి దెబ్బతింటుంది. అంతేకాదు, ఇలాంటి వికెట్లు ప్రత్యర్థి బౌలర్లకూ మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం ఇస్తాయి. స్వదేశంలో భారత్ టెస్టులు కోల్పోవడానికి ఇదే కీలక కారణం’ అని హీలీ విశ్లేషించారు.