బర్మింగ్‌హామ్ : టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత వరుసగా రెండు సిరీస్‌ల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురై తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ ఇప్పుడు వన్డే ఫార్మాట్ పోటీకి రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో షార్ట్ ఫార్మాట్లో పూర్తిగా తేలిపోయిన భారత్.. వన్డేల్లో అయినా తన ఆటను, రాతను మెరుగు పరుచుకోవాలని చూస్తోంది. ఉపఖండంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన, సవాల్ విసిరే వికెట్లపై జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ పేస్ దెబ్బకు షార్ట్ ఫార్మాట్లో అయ్యర్ అండ్ కో ఆపసోపాలు పడింది. వన్డేల్లోనూ భారత్‌కు వీళ్ల నుంచి ముప్పు తప్పదు.
కానీ, వెటరన్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు టీ20 సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా చేరిక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘రోకో’తో పాటు ఈ ఫార్మాట్లో చెలరేగిపోతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. టీ20 కెప్టెన్‌గా తేలిపోయినప్పటికీ బ్యాటర్‌గా మెప్పించిన అయ్యర్ కూడా బరిలో ఉండటంతో బ్యాటింగ్ విభాగంలో పెద్దగా సమస్యలు కనిపించడం లేవు. కానీ, బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ బౌలింగ్ విభాగానికి సవాళ్లు తప్పేలా లేవు. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌పై సత్తా చాటిన కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఏమేరకు రాణిస్తాడన్నది ఆసక్తికరం.
లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ తన బౌలింగ్‌లో మరింత వైవిధ్యం చూపెట్టాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా, నితీశ్ రెడ్డి గైర్హాజరీలో శివమ్ దూబే నాలుగో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక, టీ20 సిరీస్‌లో సుందర్, అక్షర్ పటేల్ బ్యాట్, బాల్‌తో పూర్తిగా విఫలమవడం ఆందోళన కలిగిస్తోంది. చైనామన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌పై ఎక్కువ భారం పడనుంది. మరోవైపు టీ20 సిరీస్ గెలుపు జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. కెప్టెన్ బ్రూక్, బట్లర్, బెథెల్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ చేరికతో బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అయింది. అయితే, జనవరిలో శ్రీలంక టూర్ తర్వాత ఇంగ్లిష్ టీమ్ వన్డే ఫార్మాట్ ఆడకపోవడం భారత్‌కు కాస్త కలిసొచ్చే అంశం.