Four Nations Tournament : నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ జట్టు పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య అర్జెంటీనా చేతిలో ఇండియా 2-4తో ఓటమి పాలైంది. తొలి అర్థ భాగంలోనే ఇరుజట్లు రెండేసి గోల్స్ చేశారు. దాంతో, మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఫార్వర్డ్ కనికా సివాచ్ (Kanika Siwach) రెండు గోల్స్‌తో రాణించినా.. భారత డిఫెన్స్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకున్న అర్జెంటీనా త్వరితగతిన మరో రెండు గోల్స్‌తో ఆధిక్యం కనబరిచింది.
ఆట మొదలైన 5వ నిమిషంలోనే అర్జెంటీనా ప్లేయర్ సోల్ గిగ్నెట్ గునజు గోల్ కొట్టింది. మరో రెండు నిమిషాల్లోనే సొల్ ఒల్లాల డె లబ్రా గోల్ చేయడంతో ఆతిథ్య జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయినా సరే ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వని భారత అమ్మాయిలు.. అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించారు. కనికా సివాచ్ అర్జెంటీనా గోల్ కీపర్ కళ్లుగప్పి 11వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో భారత్ బోణీ చేసింది.
Tough loss in the final challenge.🏑
Despite the result not going our way, kanika delivered a stellar performance once again, proving her mettle throughout the tournament. 💪🏻
She struck twice in the match, giving us a fighting chance, but Argentina managed to seal the game 4–2.… pic.twitter.com/BRlX8M1c8Q
— Hockey India (@TheHockeyIndia) June 2, 2025
అయితే.. 13వ నిమిషంలోనే మిలాగ్రోస్ గోల్ చేయగా.. అర్జెంటీనా ఆధిక్యం 3-1కు చేరింది. 37వ నిమిషంలో మరొక గోల్ కొట్టిన ఆ జట్టు మ్యాచ్‌పై పట్టుబిగించింది. 45వ నిమిషంలో కనికా మరో గోల్ కొట్టి ఆశలు రేపినా అర్జెంటీనా అమ్మాయిలు పట్టుదలగా ఆడారు. చివరి నిమిషంలో భారత డిఫెండర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో టోర్నీ నుంచి భారత జట్టు నిష్క్రమించక తప్పలేదు.