నల్లగొండ రూరల్, జూన్ 02 : పల్లెల్లో చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను ధ్వంసం చేస్తుంది. ఎక్కడ చూసినా చెరువులు ఆనవాళ్లు కోల్పోయి కనబడుతున్నాయి. నల్లగొండ మండలంలోని అన్నేపర్తి గ్రామంలో గల తూర్పు చెరువు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ చెరువు విస్తీర్ణం 121 ఎకరాల 20 గుంటలు. కాగా 80 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. దీనికి తోడు గత మూడు రోజులుగా చెరువు మట్టిని కొందరు అక్రమంగా తరలించుకు పోతున్నారు.
అన్నేపర్తి నుండి ఎల్లారెడ్డిగూడెం వరకు మంజూరైన కోటి రూపాయల రోడ్డు నిర్మాణం కోసం సదురు కాంట్రాక్టర్ గ్రామంలోని చెరువు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. అధికార పార్టీ అండదండలతోనే సదురు కాంట్రాక్టర్ ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు మట్టి ఆక్రమణ విషయం తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తక్షణమే మట్టి తరలింపును నిలిపివేసి, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా చెరువు ఆక్రమణకు గురికాకుండా అధికారులు హద్దులు గుర్తించాలన్నారు. ఈ విషయంపై నీటి పారుదల శాఖ డీఈ సతీశ్ చంద్రన్నను వివరణ కోరగా..మట్టి తరలింపు విషయం తన దృష్టికి రాలేదని, అక్రమంగా మట్టి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు.
Nalgonda Rural : అన్నేపర్తి తూర్పు చెరువు నుండి మట్టి అక్రమ తరలింపు