ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో ఈసారి దేశానికి కచ్చితంగా పతకాలు సాధిస్తారని భావిస్తున్న క్రీడలలో ఒకటిగా ఉన్న ‘షూటింగ్’లో బరిలోకి దిగబోయే ఆటగాళ్ల పేర్లను జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ) మంగళవారం వెల్లడించింది. తెలంగాణ అమ్మాయి, గత ఆసియాగేమ్స్(2022)లో నాలుగు పతకాలు సాధించిన యువ షూటర్ ఇషాసింగ్తో పాటు మరో 14 మంది షూటర్లు పారిస్‌కు వెళ్లే జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇషాసింగ్..విశ్వక్రీడల్లోనూ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. తన చెక్కుచెదరని గురితో ఇప్పటికే లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన ఈ హైదరాబాదీ పారిస్ తన కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నది.
వచ్చే నెలలో జరుగనున్న విశ్వక్రీడల్లో 25మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలోకి దిగనుంది. మరోవైపు మనూ బాకర్ రెండు విభాగాల్లో (మహిళల 10 మీటర్లు, 25 మీటర్లు) పోటీపడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా భారత్ ఈసారి ఒలింపిక్స్‌లో ఏకంగా 21 కోటాలు (8- రైఫిల్, 8-పిస్టల్.. 5-షాట్‌గన్) దక్కించుకోవడం విశేషం. రైఫిల్, పిస్టల్ ఈవెంట్స్‌లో తలపడబోయే షూటర్ల జాబితాను ప్రకటించగా షాట్‌గన్ విభాగంలో బుధవారం నుంచి లొనాటో (ఇటలీ) వేదికగా జరుగబోయే వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టును ప్రకటించనున్నారు.
పిస్టల్: ఇషా సింగ్, సరబ్జీత్ సింగ్, అర్జున్, మనూ భాకర్, రిథమ్ సంగ్వాన్, అనీష్ బన్వల్,
రైఫిల్: సందీప్ సింగ్, అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్, రమిత, సిఫ్ట్‌కౌర్ సమ్రా, అంజుమ్ మోడ్గిల్, ఐశ్వర్య తోమర్, స్వప్నీల్,