హంగ్జౌ(చైనా): మహిళల ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ దుమ్మురేపుతున్నది. ఇప్పటికే పురుషుల ఆసియా టైటిల్ గెలువగా, తామేం తక్కువ కాదన్నట్లు అమ్మాయిలు అదరగొడుతున్నారు. సోమవారం జరిగిన పూల్-బి చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 12-0 సింగపూర్‌పై భారీ విజయం సాధించింది. తద్వారా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా గ్రూపులో అగ్రస్థానంతో సూపర్-4కు అర్హత సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ తరఫున నవనీత్‌కౌర్(14ని, 20ని, 28ని), ముంతాజ్ ఖాన్(2ని, 32ని, 39ని) హ్యాట్రిక్ గోల్స్ చెలరేగగా, నేహా(11ని, 38ని), లాల్రెమ్సియామి(13ని), ఉదిత(29ని), శర్మిలా(45ని), రుతుజా పిసాల్(53ని) రాణించారు.
గత మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 11-0తో చిత్తుచేసిన భారత్..సింగపూర్‌పై కూడా అదే స్థాయిలో గోల్స్ వర్షం కురిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే తమదైన దూకుడు కనబరిచిన భారత అమ్మాయిలు..సింగపూర్ డిఫెన్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటూ వరుస విరామాల్లో గోల్స్ చేశారు. భారత్ దాడులను ఏ మాత్రం నిలువరించలేకపోయిన సింగపూర్..కనీసం గోల్ ఖాతా తెరువలేకపోయింది. ఈనెల 10న జరిగే సూపర్-4 తొలి పోరులో కొరియాతో భారత్ తలపడనుంది.