ముల్లాన్‌పూర్: అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. బ్యాటర్ల జోరుకు తోడు అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్(3/21)అద్భుతమైన బంతులతో సత్తా చాటడంతో రెండో రోజే మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. అతని ధాటికి ఆదివారం ఆట చివరకు అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 113/5 స్కోరుతో కష్టాల్లో పడింది. దేశవాళీ సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ సుతార్ సంధించిన సంప్రదాయ స్పిన్ బౌలింగ్‌కు అఫ్గ్గాన్ బ్యాటర్ల దగ్గర సరైన సమాధానం లేకపోయింది. పేసర్ ప్రసిధ్ కృష్ణ(2/27) కూడా రాణించాడు. మిడిలార్డర్ బ్యాటర్ రెహమత్షా(43 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. ఇంకా 451 పరుగుల వెనుకంజలో ఉన్న అఫ్గాన్‌ను ఫాలోఆన్ ప్రమాదం వెంటాడుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 368/3తో ఆట కొనసాగించిన టీమిండియా 564/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(177 బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్స్‌తో 126), రిషబ్ పంత్ (81), సుందర్(52 నాటౌట్) జట్టుకు భారీ స్కోరు అందించారు.అఫ్గ్గాన్ యువ పేసర్ సలీమ్ (6/140) ఆరు వికెట్లతో విజృంభించాడు.
తొలిసారి ఆతిథ్యమిస్తున్న ముల్లాన్‌పూర్ పిచ్‌పై సహచర బౌలర్లు విఫలమైన చోట అఫ్గాన్ ఆటగాడు మహమ్మద్ సలీం సత్తాచాటాడు. వేగానికి స్వింగ్ జోడిస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. సెంచరీతో జోరు మీద కనిపించిన ఓవర్‌నైట్ బ్యాట గిల్..సలీం బౌలింగ్‌లో కీపర్ అప్సర్‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు పంత్‌తో కలిసి 169 పరుగుల కీలక భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. జురెల్(19) క్రీజులో ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. స్కేర్ వికెట్ దిశగా బౌండరీలు బాదిన జురెల్‌ను సలీం సూపర్ స్వింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. పంత్ సంయమనం పాటించాడు.
ఇటీవల కాలంలో చెత్త షాట్లతో వికెట్ సమర్పించుకుంటున్న పంత్ ఈసారి తనదైన బ్యాటింగ్‌తో విమర్శకులకు దీటైన సమాధానం ఇచ్చాడు. సెంచరీ వైపు సాఫీగా సాగుతున్న క్రమంలో హష్మతుల్లా షాహిది బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్..ఒమర్జాయ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఈ దశలో ఆల్‌రౌండర్ సుందర్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి జట్టుకు కీలక పరుగులు జతచేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో అర్ధసెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. మానవ్ సుతార్ (28) రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఆకట్టుకోగా, సిరాజ్ (22) నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో కీలక పరుగులు జతచేయడంతో భారత్ భారీ స్కోరు అందుకుంది.
దాయ స్పిన్‌తో అఫ్గ్గాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. టీ విరామానికి ముందు సుతార్‌ను బౌలింగ్‌కు దించిన కెప్టెన్ గిల్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. సుతార్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయిన ఓపెనర్ మాలిక్(16)..సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అఫ్గ్గాన్ను 28/1స్కోరుకు పరిమితం చేసి టీ బ్రేక్ వెళ్లిన భారత్..ఆ తర్వాత అదే స్పిన్ తంత్రాన్ని కొనసాగించింది. ఓ ఎండ్‌లో ప్రసిధ్ పేస్‌తో రాణిస్తే..సుతార్ స్పిన్ వైవిధ్యంతో వికెట్లు పడగొట్టారు.
అటల్(17)ను ప్రసిద్ధ్ క్లీన్‌బౌల్డ్ చేస్తే.. గుర్బాజ్(12)ను సుతార్ మూడో వికెట్‌గా పెవిలియన్ పంపాడు. సుతార్ వేసిన బంతిని ఆడే క్రమంలో స్లిప్‌లో.. సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి గుర్బాజ్ ఔటయ్యాడు. కెప్టెన్ షాహిది (20)ని ప్రసిధ్ ఎలీ చేగా..జజాయ్(3)ను సుతార్ రిటర్న్ క్యాచ్‌తో ఐదో వికెట్‌గా ఔట్ చేసి రెండో రోజు ఆటను ముగించాడు. మూడో రోజు తొలి సెషన్లో మిగిలిన ఐదు వికెట్లు తీసి అఫ్గ్గాన్ను ఫాలోఆన్‌లోకి నెట్టాలని భారత్ భావిస్తోంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 564/8 డిక్లేర్డ్(గిల్ 126, రాహుల్ 100, సలీమ్ 6/140, రెహమాన్ 1/91),
అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 113/5(రెహమత్ షా 43 నాటౌట్, షాహిది 20, సుతార్ 3/21, ప్రసిధ్ కృష్ణ 2/27)