Team India | వుమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా రెండోసారి అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా గెలుపొందింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు (8×4) చేసి నాటౌట్‌గా నిలిచింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత జట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు.
ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపింది. ఈ టోర్నీలో సెంచరీ బాదేసింది. ఫైనల్లోనూ మూడు వికెట్లతో రాణించి, విజయానికి కారణమై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా గొంగడి త్రిష నిలిచింది.