IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ రెండోసారి అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. లీగ్ దశలో హ్యాండ్ షేక్ వివాదం తర్వాత చిరకాల ప్రత్యర్థులు సూపర్ 4 తొలి పోరులో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ షురూ కానుంది. అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో విజయంపై టీమిండియా ధీమాగా ఉండగా.. పాక్ మాత్రం అద్భుతం చేయాలని అనుకుంటోంది. కానీ, గత మూడు టీ20ల్లో భారత్ చేతిలో ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. సో.. ఈసారి కూడా సల్మాన్ అఘా నేతృత్వంలోని పాక్‌కు భంగపాటు తప్పకపోవచ్చు.
వన్డేల్లోనూ కాదే టీ20ల్లోనూ పాక్‌పై భారత్ పెత్తనం నడుస్తోంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 14 సార్లు ఎదురుపడగా టీమిండియా 11విజయాలతో ఆధిపత్యం చెలాయించింది. పాక్ మాత్రం మూడంటే మూడేసార్లు గెలుపొందింది. గత మూడు టీ20ల్లో మాత్రం భారత్‌దే జోరు సాగింది. మూడేళ్ల క్రితం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా దాయాదిపై 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది రోహిత్ శర్మ సేన. నిరుడు ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన పొట్టి ప్రపంచకప్‌లోనూ పాక్‌కు పరాజయమే ఎదురైంది. జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India have won their last three T20Is against Pakistan 🙌
Can Pakistan break this run today? pic.twitter.com/ugjrkAzlxf
— ESPNcricinfo (@ESPNcricinfo) September 21, 2025
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లోనూ తమకు తిరుగులేదని టీమిండియా చాటింది. సెప్టెంబర్ 14న లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది సూర్యకుమార్ యాదవ్ బృందం. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిప్పేయగా ప్రత్యర్థిని 128కే కట్టడి చేసి.. స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడేసింది. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడే పాక్ ఈసారి మాత్రం పేలవంగా కనిపిస్తోంది.
Kuldeep Yadav has put in some standout performances in #AsiaCup2025 💫
How many wickets will he take today? ⬇️#indvspak pic.twitter.com/fnVV5neJC5
— Cricbuzz (@cricbuzz) September 21, 2025
కనీస పోటీ ఇవ్వకుండా లీగ్ దశలో చేతులెత్తేసిన దాయాది బ్యాటర్లు.. సూపర్ 4లో ఏమేరకు రాణిస్తారో చూడాలి. మరోవైపు.. పాక్ పేరెత్తితే చాలు పూనకం వచ్చినట్టు చెలరేగే టీమిండియా ఆటగాళ్లు.. మరోసారి ఆ జట్టు భరతం పట్టేందుకు కాచుకొని ఉన్నారు. మరో విషయం.. ఈ మ్యాచ్‌కూ ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించడం సల్మాన్ అఘా సేనకు మింగుడుపడకపోవచ్చు.