బుడాపెస్ట్: ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించింది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టోర్నీ ఓపెన్ విభాగంలోభారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2020లో రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన భారత్ తాజాగా స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం రాత్రి జరిగిన పదో రౌండ్ పోరులో భారత బృందం 2.5-1.5 తేడాతో అమెరికాపై అద్భుత విజయం సాధించింది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తలపడబోతున్న దొమ్మరాజు గుకేశ్.. అమెరికా స్టార్ ప్లేయర్ ఫాబియానో కరువానను మట్టికరిపించాడు. అయితే వెస్లీ చేతిలో ప్రజ్ఞానంద ఓటమిపాలు కావడంతో పోరు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ యువ జీఎం ఇరిగేసి అర్జున్ డొమింగే పెరెజ్‌పై గెలిచి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. లెవాన్ ఆరోనియాన్తో గేమ్‌ను విదిత్ గుజరాతీ డ్రా చేసుకోవడంతో మన గెలుపు ఖరారైంది. మరోవైపు మహిళల విభాగంలో భారత్ 2.5-1.5తో చైనాపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది.