నేడు భారత్, వెస్టిండీస్ మూడో టీ20
రాత్రి 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..
కోల్‌కతా: పూర్తి ఆధిపత్యంతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన టీమ్ఇండియా.. నామమాత్రమైన ఆఖరి పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో రోహిత్ సేన చివరి మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. పొట్టి ఫార్మాట్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తుంటే.. విండీస్ విజయంతో పర్యటనను ముగించాలని యోచిస్తున్నది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు విశ్రాంతినిచ్చిన బోర్డు.. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వనుంది. శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ బలాన్ని పెంచాలని మేనేజ్మెంట్ చూస్తున్నది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బరిలోకి దిగన దీపక్ హుడా, అవేశ్ ఖాన్, హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కుతుందా చూడాలి!
పొట్టి ఫార్మాట్లో భారత తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచేందుకు యుజ్వేంద్ర చాహల్ (66)ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అతడు ప్రస్తుతం సంయుక్తంగా టాప్‌లో కొనసాగుతున్నాడు.
2019 నుంచి స్వదేశంలో భారత జట్టు వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు చేజిక్కించుకుంది. మూడు ఫార్మాట్లలో కలిపి టీమ్ఇండియాకు ఇది 13వ సిరీస్ విజయం కావడం విశేషం.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్/దీపక్ హుడా, హర్షల్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్/సిరాజ్, చాహల్/కుల్దీప్.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, మయేర్స్, పూరన్, పావెల్, హోల్డర్, చేజ్, షెఫర్డ్, ఓడెన్, అకీల్, కాట్రెల్.