చెన్నై: స్వదేశంలో జరిగిన స్కాష్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. రాబోయే 2028 ఒలింపిక్స్‌లో ఈ ఆటను అరంగేట్రం చేయించనున్న నేపథ్యంలో భారత్.. హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో భారత్.. 3-0తో హాంకాంగ్‌ను చిత్తుచేసి ఈ టోర్నీలో తొలి ట్రోఫీని దక్కించుకుంది.
మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌గా జరిగిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో జ్యోత్స్న చినప్ప 3-1 (7-3, 2-7, 7-5, 7-1)తో లి కా యిని చిత్తుచేసింది. మెన్స్ సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ర్యాంకర్ అభయ్ సింగ్.. 3-0 (7-1, 7-4, 7-4)తో అలెక్స్ లాయును మట్టికరిపించాడు. మరో పోరులో 17 ఏండ్ల ఢిల్లీ అమ్మాయి అన్హత్ సింగ్.. 3-0 (7-2, 7-2, 7-5)తో టొమాటో హుపై గెలిచింది. నిరుటి ఎడిషన్‌లో కాంస్యం గెలిచిన భారత్.. ఈ విజయంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్ తర్వాత స్కాష్ వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా నిలిచింది.