విశ్వక్రీడల్లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించిన భారత హాకీ జట్టు ఆసియాలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. చైనా వేదికగా జరిగిన ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో 1-0తో చైనాను చిత్తు చేసి జయకేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన చైనా.. తుదిపోరులో భారత్‌కు గట్టి పోటీనిచ్చినా ఆట ఆఖర్లో జుగ్రాజ్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోగలిగింది.
హులన్‌బుయిర్ (చైనా): ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి జోరు మీదున్న భారత హాకీ జట్టు మరో మెగా టోర్నీలో సత్తాచాటింది. చైనా వేదికగా జరిగిన ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) ఫైనల్లో భారత్.. 1-0తో చైనాను ఓడించి వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ఏసీటీని సొంతం చేసుకుంది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేనకు తుది పోరులో చైనా నుంచి గట్టి సవాలే ఎదురైనా జుగ్రాజ్ సింగ్ 51వ నిమిషంలో కొట్టిన గోల్‌తో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ కొట్టిన హర్మన్‌ప్రీత్ ఫైనల్లో గోల్ చేయడంలో విఫలమైనా జుగ్‌రాజ్‌కు బంతిని అందించడంలో సఫలీకృతుడయ్యాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్.. 5-2తో దక్షిణ కొరియాను ఓడించి పరువు నిలుపుకుంది.
భారత్‌తో పోల్చితే అంతగా అనుభవం లేని చైనాకు ఇది అంతర్జాతీయ స్థాయిలో రెండో ఫైనల్ (2006 ఆసియా క్రీడల్లో తొలిసారి ఫైనల్ చేరింది) మాత్రమే. కానీ సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో ఆ జట్టు రెచ్చిపోయింది. తొలి మూడు క్వార్టర్స్‌లో మన ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా చైనా రక్షణ శ్రేణి గోల్ చేసే అవకాశమే ఇవ్వలేదు. లీగ్ దశలో భారత్‌కు (3-0)తో అలవోకగానే లొంగిన చైనా.. ఫైనల్లో మాత్రం హోరాహోరీగా పోరాడింది. ఆట ఆరంభంలో భారత ఆటగాడు రాజ్‌కుమార్ పాల్ గోల్ చేసేందుకు అవకాశం దక్కినా చైనా గోల్ కీపర్ వాంగ్ వీహవొ దానిని విజయవంతంగా అడ్డుకున్నాడు. 10వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ (పీసీ) అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేదు. తొలి క్వార్టర్ ముగియనుండగా చైనాకు వచ్చిన పీసీని భారత గోల్ కీపర్ కృషణ్ బహదూర్ పాఠక్ అడ్డుకున్నాడు. రెండో క్వార్టర్లోనూ దాదాపు ఇదే కథ నడిచింది. ‘మెన్ ఇన్ బ్లూ’ ఎదురుదాడికి చైనా దీటుగానే సమాధానమిచ్చింది.
ఆట నాలుగో క్వార్టర్ దాకా గోల్ లేకుండా డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌కు ఆఖర్లో హర్మన్‌ప్రీత్, జుగ్రాజ్ ఊపు తెచ్చారు. నాలుగో క్వార్టర్ 9వ నిమిషంలో చైనా డిఫెన్స్‌ను తప్పించుకుంటూ సర్కిల్‌లోకి వచ్చిన హర్మన్‌ప్రీత్.. గోల్‌పోస్ట్‌కు అత్యంత సమీపంలో ఉన్న జుగ్‌రాజ్‌కు బంతిని పాస్ చేశాడు. బంతిని అందుకున్న జుగ్రాజ్.. రెప్పపాటు వేగంతో దానిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి తొలి గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆఖర్లో చైనా గోల్కీపర్ను తప్పించి ఎక్స్ట్రా ఫీల్డర్‌తో గోల్ కోసం యత్నించినా ఫలితం దక్కలేదు. టోర్నీ ఆద్యంతం రాణించిన హర్మన్‌ప్రీత్ సింగ్ (7 గోల్స్)కు ‘హీరో ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది.
2011లో ప్రారంభించిన ఈ టోర్నీ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్ 2012లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016, 2018లో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచింది. 2023, 2024లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
7 ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ చేసిన గోల్స్. యంగ్ జి జిహున్ (ద.కొరియా) 9 గోల్స్‌తో ప్రథమ స్థానంలో ఉన్నాడు.
5 మంగళవారం ముగిసిన టోర్నీ 8వ ఎడిషన్ కాగా ఇందులో భారత్ ఐదుసార్లు విజేత కాగా ఒకసారి రన్నరప్‌గా నిలిచింది.