టోర్నీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. దాయాది పాకిస్థాన్‌పై భారత్ క్రికెట్ జట్టుదే పైచేయి అవుతోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ అదే ఫలితం పునరావృతమైంది. అటు బ్యాట్.. ఇటు బంతితో అదరగొట్టిన టీమిండియా హోరాహోరీ తప్పదనుకున్న పోరును ఏకపక్షం చేసేసింది. దాయాది జట్టును చిత్తు చిత్తుగా ఓడిస్తూ ట్రోఫీ వేటను షురూ చేసింది.
బర్మింగ్‌హామ్ : మహిళల వన్డే వరల్డ్ చాంపియన్ భారత్ టీ20 వరల్డ్ కప్‌ను అద్భుత విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బౌలింగ్‌లో దీప్తి శర్మ (5/10), తెలుగమ్మాయి శ్రీచరణి (3/21) విజృంభించడంతో ఆదివారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా 64 రన్స్ తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ తొలుతనిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు సాధించింది.మంధానతో పాటు హర్మన్‌ప్రీత్ (35 బంతుల్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోశ్ (17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 నాటౌట్) సత్తా చాటారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా (2/33), సాదియా ఇక్బాల్ (2/41) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం దీప్తి, చరణి స్పిన్ వలలో చిక్కిన పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మునీబా అలీ (41) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 17న జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.
వైస్ కెప్టెన్ మంధాన, కెప్టెన్ హర్మన్‌కు తోడు చివర్లో రిచా ఘోశ్ మెరుపులతో భారీ మంచి స్కోరు చేసింది. ఆరంభంలో మాత్రం పాక్ బౌలర్లదే పైచేయింది. సాదియా ఇక్బాల్ ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన షెఫాలీ (6).. ఐదో బాల్‌కు మునీబాకు క్యాచ్ ఇచ్చింది. నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన తస్మియా తన రెండో బంతికే జెమీమా(1)ను పెవిలియన్ చేర్చడంతో భారత్ 18/2తో ఇబ్బందుల్లో పడింది.ఈ దశలో మంధాన, హర్మన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కెప్టెన్ జాగ్రత్త పడినా.. సైదా ఇక్బాల్, రమీనా ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన మంధాన 38/2తో పవర్‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత వరుసగా రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఎనిమిదో ఓవర్లో మంధాన ఓ క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకుంది. అయితే, నష్రా సంధును టార్గెట్ చేసిన హర్మన్ రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చింది. మరోవైపు లెఫ్టార్మ్ సీమర్ తస్మియా రుబాబ్ బౌలింగ్‌లో మంధాన కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అదే జోరుతో వెంటవెంటనే మరో మూడు ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది.
పాక్ ఫీల్డింగ్ వైలఫ్యం కూడా ఆమెకు కలిసొచ్చింది. సాదియా ఇక్బాల్ వేసిన 13వ ఓవర్లో మంధాన ఇచ్చిన మరో క్యాచ్ ఇవ్వగా..లాంగాన్ వద్ద ఫీల్డర్ చేతుల్లోంచి బంతి బౌండరీ అవతల పడింది. మంధాన స్ఫూర్తితో హర్మన్ స్లాగ్ స్వీప్ షాట్లతో బౌండరీల వేగం పెంచడంతో భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, రమీన్ షమీమ్ బౌలింగ్‌లో మంధాన కొట్టిన షాట్ మిస్టైమ్ అయి పాక్ కెప్టెన్ ఫాతిమా సనా చేతిలో పడటంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లోనే భారతి ఫుల్మాలి (0) స్టంపౌట్ అవ్వగా.. ఫాతిమా సనా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ పెవిలియన్ చేరడంతో పాక్ రేసులోకి వచ్చేలా కనిపించింది. వరుసగా 22 బంతుల్లో ఒక్క ఫోర్ రాకపోవడంతో భారత్ 150 కూడా చేయడం కష్టం నిపించింది. కానీ, చివరి రెండు ఓవర్లలో దీప్తి శర్మ (12 నాటౌట్) తోడుగా రిచా ఘోష్ పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. తస్మియా వేసిన 19వ ఓవర్లో దీప్తి ఓ ఫోర్ రాబట్టగా.. రిచా 4,6, 4, 4తో చెలరేగడంతో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో తను మరో ఫోర్ కొట్టడంతో భారత్ మంచి స్కోరు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లోనూ పాక్ ప్లేయర్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు.
ఛేదనలో పాక్ ఓపెనర్ మునీబా అలీ వరుస బౌండరీలతో హడలెత్తించినా.. స్పిన్నర్లు దీప్తి, శ్రీచరణి రంగ ప్రవేశం తర్వాత ఆ జట్టు పూర్తిగా డీలా పడింది. పది వికెట్లలో స్పిన్నర్లే 9 తీశారు. పవర్‌ప్లేలో మాత్రం మునీబా అదరగొట్టింది. ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండ్రీకి చేర్చిన ఆమె.. మూడో ఓవర్లో క్రాంతి గౌడ్‌కు మూడు ఫోర్లతో స్వాగతం పలికింది. అయితే, ఐదో ఓవర్లో బంతి అందుకున్న స్పిన్నర్ దీప్తి గుల్ ఫెరోజా (12)ను ఔట్ చేసి పాక్ పతానం ఆరంభించింది. దీప్తి బౌలింగ్‌లోనే ఆయేషా (12) ఔటవగా.. వరల్డ్ కప్ అరంగేట్రం స్పిన్నర్ శ్రీచరణి వేసిన ఎనిమిదో ఓవర్లో హర్మన్ క్యాచ్‌కు సైరా జబీన్ (2) చిక్కింది. ఫీల్డింగ్‌లోనూ మెప్పించిన దీప్తి.. ఫిఫ్టీ దిశగా వెళ్తున్న మునీబాను డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేయగా.. షెఫాలీ బౌలింగ్‌లో కెప్టెన్ ఫాతిమా (0) డకౌట్ అవ్వడంతో 77/5తో పాక్ పూర్తిగా డీలా పడింది. శ్రీచరణి వరుస ఓవర్లలో నటాలియా పర్వేజ్ (7) హర్మన్‌కు క్యాచ్ ఇవ్వగా.. బ్యాక్వర్డ్ పాయింట్లో శ్రేయాంక పట్టిన సూపర్ క్యాచ్‌కు రమీమ్ (4) ఏడో వికెట్‌గా ఔటైంది. 17వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన దీప్తి.. మిగిలిన మూడు వికెట్లు కూల్చేసింది.
5/10 టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది.
166 టీ20ల్లో దీప్తి శర్మ తీసిన వికెట్లు. ఈ ఫార్మాట్లో టాప్ వికెట్ టేకర్‌గా తను థాయ్‌లాండ్ బౌలర్ తిపచా పుతావాంగ్ (165) రికార్డు బ్రేక్ చేసింది.
భారత్ : 20 ఓవర్లలో 170/6 (స్మృతి మంధాన 68, హర్మన్‌ప్రీత్ 36, రిచా ఘోష్ 34; ఫాతిమా సనా 2/33, సాదియా ఇక్బాల్ 2/41);
పాకిస్థాన్: 17 ఓవర్లలో 106 ఆలౌట్ (మునీబా 41, దీప్తి శర్మ 5/10, శ్రీచరణి 3/21)