ఎన్నాళ్లకెన్నాళ్లకు! 58 ఏండ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయం ఎట్టకేలకు దరిచేరింది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన బర్మింగ్‌హామ్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును అంతగా అనుభవం లేని కుర్రాళ్లతో కూడిన నయా టీమ్ఇండియా చేతల్లో చూపెట్టింది. ఇంగ్లండ్‌కు పెట్టనికోట లాంటి బర్మింగ్‌హామ్‌ను బద్దలు కొడుతూ 336 పరుగుల తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. వరుణుడి అంతరాయంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైనా ఆకాశ్‌దీప్ ఆరు వికెట్ల విజృంభణతో చిరస్మరణీయ గెలుపును సొంతం చేసుకుంది. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన గిల్‌సేన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుని ఔరా అనిపించుకుంది.
బర్మింగ్‌హామ్: భారత క్రికెట్లో కొత్త అధ్యాయం! దిగ్గజాలు విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ, అశ్విన్ నిష్క్రమణ తర్వాత పరివర్తన దశలో ఉన్న టీమ్ఇండియా ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్రకు నాంది పలికింది. నూనుగు మీసాల శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్‌ను రెండో టెస్టులో మట్టికరిపించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన పోరులో టీమ్ఇండియా 336 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై పరుగుల పరంగా భారీ గెలుపును ఖాతాలో వేసుకుంది. టీమ్ఇండియా నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 72/3 ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌దీప్(6/99) ఆరు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. జెమీ స్మిత్(88) అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. సిరాజ్, సుందర్, జడేజా, ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ కాస్తా ప్రస్తుతం 1-1తో సమమైంది. డబుల్ సెంచరీకి తోడు మరో సెంచరీతో కదంతొక్కిన కెప్టెన్ గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 10 నుంచి లార్డ్స్‌లో మొదలుకానుంది.
ఆకాశ్‌దీప్ అదుర్స్ : బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్‌దీప్ అంచనాలకు మించి రాణించాడు. వర్షం కారణంగా గంట విరామం తర్వాత మొదలైన ఐదో రోజు ఆటలో ఆకాశ్దీప్దే హవా. తన స్వింగ్ బౌలింగ్‌తో ఆకాశ్‌దీప్..ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాటర్లకు చుక్కలుచూపెట్టాడు. బంతిని ఇరు వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌దీప్ విసిరిన బంతిని సరిగ్గా అర్థం చేసుకోని పోప్(24) వికెట్ల మీదకు ఆడుకుని నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడే ఇంగ్లండ్ పతనానికి ఆకాశ్ తెరతీశాడు. మరో ఓవర్ తేడాతో ప్రమాదకర బ్రూక్(23)ను వికెట్ల ముందు ఆకాశ్ దొరకబుచ్చుకున్నాడు. షాట్ ఆడే క్రమంలో లైన్ మిస్సయిన బ్రూక్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టోక్స్..స్మిత్‌కు జతకలిశాడు. వీరిద్దరు..భారత బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశారు. వికెట్లనుక కాపాడుకుంటూ అనవసర షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్ పరిణతి కనబరిచాడు.
వీరద్దరు క్రీజులో కుదురుకుంటారనుకున్న తరుణంలో గిల్ వేసిన ప్లాన్ వర్క్ఔట్ అయ్యింది. సరిగ్గా లంచ్‌కు ముందు సుందర్ బౌలింగ్‌లో స్టోక్స్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. డీఆర్ఎస్కు వెళ్లినా స్టోక్స్‌కు నిరాశ తప్పలేదు. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 153/6 స్కోరుతో ఉంది. భారత విజయానికి మిగిలింది నాలుగు వికెట్లే. ఈ క్రమంలో స్మిత్..వోక్స్‌తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. లక్ష్యం భారీగా ఉండటం చేతిలో వికెట్లు లేకపోవడం ఇంగ్లండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీనికి తోడు బ్యాటర్లకు తగ్గట్లు కెప్టెన్ గిల్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించడం టీమ్ఇండియాకు లాభించింది. అయితే అర్ధసెంచరీ మార్క్ అందుకున్న స్మిత్‌తో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నంలో వోక్స్‌ను ప్రసిద్ధ్ ఔట్ చేశాడు. ఇదే క్రమంలో వోక్స్‌ను అనుసరిస్తూ ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో స్మిత్..సుందర్‌ను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖర్లో బ్రెండన్ కార్స్(38) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆకాశ్‌దీప్ వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో గిల్ క్యాచ్‌తో కార్స్ ఔట్ కావడంతో భారత్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది.
టెస్టుల్లో ఆకాశ్దీప్నకు ఇది తొలి 5 వికెట్ల ప్రదర్శన. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆకాశ్‌దీప్ 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
విదేశాల్లో టెస్టు గెలిచిన పిన్న వయసు భారత కెప్టెన్‌గా గిల్(25 ఏండ్ల 301 రోజులు) నిలిచాడు.
బర్మింగ్‌హామ్‌లో ఇప్పటి వరకు తొమ్మిది టెస్టులాడిన భారత్‌కు ఇది తొలి విజయం. తొమ్మిదింటిలో ఒకటి గెలిచిన టీమ్ఇండియా ఏడింటిలో ఓడి, ఒకటి డ్రా చేసుకుంది.
పరుగుల(336) పరంగా విదేశీ గడ్డపై టీమ్ఇండియాకు ఇది భారీ విజయం. 2016లో విండీస్‌పై 318 పరుగులతో గెలువడమే ఇప్పటి వరకు అత్యుత్తమం.
భారత్ తొలి ఇన్నింగ్స్: 587, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407, భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్డ్,
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్(స్మిత్ 88, కార్స్ 38, ఆకాశ్‌దీప్ 6/99, సుందర్ 1/28)