పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా అరుదైన ఘనతను సాధించింది. వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం.
2006 తర్వాత ఇండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లలో ఏ ఒక్కటి కూడా టీమిండియా ఓడలేదు. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య జరిగిన 12 వన్డే సిరీస్‌లనూ భారత్ నెగ్గింది. 2006లో భారత జట్టు 1-4 తేడాతో విండీస్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకుంది.
బ్రియాన్ లారా సారథ్యంలోని వెస్టిండీస్ ఆ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఆసక్తికరంగా ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ అప్పుడు భారత జట్టు సారథిగా ఉండటం గమనార్హం. ఇదిలాఉండగా ఒక జట్టుపై వరుసగా 11 వన్డే సిరీస్‌లను గెలిచన రికార్డు గతంలో పాకిస్తాన్ పేరిట ఉండేది. పాక్.. జింబాబ్వేపై ఈ రికార్డు (1996 నుంచి 2021 వరకు) అందుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో పాక్‌ను వెనక్కినెట్టిన భారత జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఆదివారం ముగిసిన రెండో వన్డేలో బౌలింగ్‌లో విఫలమైనా భారత బ్యాటర్లు పట్టుదలతో ఆడి ఇండియాకు విజయాన్ని అందించారు. 312 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54)తో పాటు చివర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది.