భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభానికి వేళయైంది. దిగ్గజాలు విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ, అశ్విన్ నిష్క్రమణ వేళ అంతగా అనుభవం లేని యువ జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్..ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు సై అంటున్నది. లీడ్స్ వేదికగా నేటి నుంచే మొదలయ్యే తొలి టెస్టు ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పోరుకు తెరలేవనుంది. రోహిత్ నుంచి పగ్గాలు అందుకున్న శుభ్‌మన్‌గిల్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగుతుంటే ‘బజ్‌బాల్’ లక్ష్యంగా స్టోక్స్‌సేన సవాల్ విసురుతున్నది. సొంతగడ్డపై సత్తాచాటేందుకు ఇంగ్లిష్ జట్టు ఉవ్విళ్లూరుతుంటే యువకులు, అనుభవజ్ఞుల మేళవింపుతో టీమ్ఇండియా దీటైన పోటీనివ్వాలన్న పట్టుదలతో ఉంది. అండర్సన్-సచిన్ ట్రోఫీగా మారిన చారిత్రక పటౌడీ టోర్నీలో శుభారంభం ఎవరిదో త్వరలో తేలనుంది.
లీడ్స్: భారత క్రికెట్లో నవశకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దిగ్గజాల వారసత్వానికి కొనసాగింపుగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న శుభ్‌మన్‌గిల్..టీమ్ఇండియాను ముందుకు నడిపించనున్నాడు. 25 ఏండ్ల వయసులో టెస్టు కెప్టెన్సీ అందుకున్న గిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిసారి 2007లో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలిచిన భారత్ 18 ఏండ్లుగా సిరీస్ విజయం కోసం చకోరా పక్షిలా ఎదురుచూస్తున్నది. తొలిసారి అజిత్ వాడేకర్ సారథ్యంలో 1971లో సిరీస్ గెలిచిన భారత్‌కు 1986లో కపిల్‌దేవ్ రెండోసారి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా 2007లో ఇంగ్లండ్‌లో ఇండియా టెస్టు సిరీస్ ముద్దాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో టీమ్ఇండియాకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పచ్చికతో కళకళలాడే ఇంగ్లండ్ పిచ్‌లపై డ్యూక్ బంతి చేసే విన్యాసాలకు మన బ్యాటర్లు తేలిపోవడంతో సిరీస్‌లు చేజారాయి. అయితే గత అనుభవాలను తిరుగరాస్తూ గిల్-గంభీర్ కాంబినేషన్లో కొత్త చరిత్ర శ్రీకారం చుట్టేందుకు టీమ్ఇండియా తహతహలాడుతున్నది. ఓవైపు అనుభవలేమి కనిపిస్తున్నా..మెండైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బజ్‌బాల్‌తో టెస్టు క్రికెట్‌కు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన స్టోక్స్-మెక్కల్లమ్ జోడీ..భారత్‌ను నిలువరించేందుకు పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నది. గత రెండు దశాబ్దాలు ఇంగ్లండ్ పేస్ బౌలింగ్‌ను తమ భుజస్కంధాలపై మోసిన అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. వీరి గైర్హాజరీలో ఇంగ్లండ్ పేస్ దళం అనుభవలేమితో కనిపిస్తున్నది.
గిల్‌పైనే భారం : రోహిత్ వారసునిగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 25 ఏండ్ల వయసులోనే టెస్టు కెప్టెన్ అయిన గిల్‌కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కోహ్లీ నిష్క్రమణతో ఖాళీ అయిన కీలకమైన నాలుగో స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు సెషన్ సెషన్‌కు మారే టెస్టులో ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడనుంది. పేస్‌కు స్వర్గధామమైన ఇంగ్లండ్ పిచ్‌లపై బ్యాటింగ్ ఒక రకంగా కత్తిమీద సాము లాంటిదే. ఊరించే బంతులను వేటాడుతూ షాట్లు ఆడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇదిలా ఉంటే తొలి టెస్టుకు తుది కూర్పుపై ఆసక్తి కొనసాగుతూనే ఉన్నది. ఇంగ్లండ్ ఇప్పటికే తమ ఫైనల్ లెవన్‌ను ప్రకటించగా, టీమ్ఇండియా మళ్లగుల్లాలు పడుతున్నది. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ ఖరారు కాగా, మూడో స్థానంలో సాయి సుదర్శన్, కరణ్ నాయర్‌పై సందిగ్ధత కొనసాగుతున్నది. నాలుగులో గిల్, ఐదులో పంత్ బ్యాటింగ్‌కు రానున్నారు. పిచ్‌ను బట్టి పేస్ ఆల్‌రౌండర్లు శార్దుల్ ఠాకూర్, నితీశ్‌కుమార్‌రెడ్డి ఇద్దరిని ఆడించే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ కనిపిస్తున్నది. బుమ్రా, సిరాజ్ పేస్‌బౌలింగ్‌కు సారథ్యం వహించనుండగా, మూడో పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్సింగ్లో ఎవరికి బెర్తు దక్కుతుందో చూడాలి. ఏకైక స్పిన్నర్‌గా జడేజా తుది జట్టులో ఉండే చాన్స్ ఉంది.
అనుభవలేమితో : ఇంగ్లండ్ బౌలింగ్ బృందం అనుభవలేమితో కనపడుతున్నది. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత వారి స్థానాలను భర్తీ చేసే బౌలర్లు ఇంగ్లండ్‌కు ఇంకా దొరుకలేదు. బ్రైడన్ కార్స్, జోష్ టాంగ్‌కు అంతగా అనుభవం లేకపోగా, క్రిస్ వోక్స్ పెద్ద దిక్కుగా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్‌గా బషీర్ కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విషయానికొస్తే జాక్ క్రా డకెట్, రూట్, బ్రూక్, పోప్, స్టోక్స్‌తో బలంగా కనిపిస్తున్నది. భారత్ అంటే రెచ్చిపోయే రూట్ ఇంగ్లండ్‌కు కీలకం కాబోతున్నాడు.
భారత్: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్(కెప్టెన్), పంత్, కరణ్నాయర్, జడేజా, శార్దుల్/ నితీశ్/కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: క్రాలె, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(కెప్టెన్), స్మిత్, వోక్స్, కార్స్, టాంగ్, బషీర్
పచ్చికతో కనిపిస్తున్న హెడింగ్లే పిచ్..పేస్‌కు బాగా సహకరించనుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గుచూపే అవకాశముంది. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం వేసవి కొనసాగుతున్న నేపథ్యంలో రోజులు మారిన కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నది. గత ఆరు సార్లు తొలుత బౌలింగ్ చేసిన జట్లే విజయాలు సాధించాయి.
2018 నుంచి ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు(597) చేసిన పర్యాటక బ్యాటర్‌గా రాహుల్ టాప్‌లో ఉన్నాడు.
హెడింగ్లేలో భారత్ ఏడు టెస్టు మ్యాచ్‌లాడితే రెండింటిలో గెలిచి నాలుగింటిలో ఓటమిపాలైంది.
పిన్న వయసులో భారత టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన ఐదో క్రికెటర్‌గా గిల్(25 ఏండ్లు) నిలిచాడు.
టెస్టుల్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్‌ను బుమ్రా తొమ్మిది సార్లు ఔట్ చేశాడు. కమిన్స్(11), హాజిల్‌వుడ్(10) ముందు వరుసలో ఉన్నారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటి వరకు 136 మ్యాచ్‌లు జరిగితే ఇంగ్లండ్ 51, భారత్ 35 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 50 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.