దాయాదిపై విజయంతో టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. ‘సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్ల కాలువ ఒక్క లెక్కా’అన్న చందంగా పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ అర్ధశతకాలతో ఆకట్టుకుంటే.. బౌలింగ్‌లో భువనేశ్వర్, అర్శ్‌దీప్, అక్షర్, అశ్విన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సంచలనాలకు నెలవుగా మారిన ప్రస్తుత మెగాటోర్నీలో ఇప్పటికే ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ షాకిస్తే.. తాజాగా పాకిస్థాన్‌పై జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసుకొని గ్రూప్-2లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది.
సిడ్నీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసుకుంది. సూపర్-12లో భాగంగా గురువారం జరిగిన పోరులో రోహిత్ సేన 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. దీంతో రెండు విజయాలు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా 4 పాయింట్లతో పట్టిక టాప్‌లో కొనసాగుతున్నది. టాపార్డర్‌ను పరీక్షించేందుకు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 179 పరుగులు చేసింది.
పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విశ్వరూపం కనబర్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదే జోరు కొనసాగించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో అదరగొట్టారు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) మరోసారి నిరాశ పరిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్, మికెరన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 రన్స్ చేసింది. ప్రింగ్లె (20) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్శ్‌దీప్, అక్షర్ పటేల్, అశ్విన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ముగ్గురు మొనగాళ్లు
పాక్‌తో పోరు తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. కేఎల్ రాహుల్ మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరిపోయాడు. గత మ్యాచ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న ఈ ఓపెనర్.. ఈ సారి వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రోహిత్‌కు విరాట్ జతవడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కానీ టీమ్ఇండియా ఆశించినంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి భారత్ 32/1తో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన రోహిత్ బౌండ్రీలతో రెచ్చిపోయాడు. పదో ఓవర్లో 4,6 బాదిన హిట్‌మ్యాన్.. మరుసటి ఓవర్లో రెండు ఫోర్లతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కాసేపటికి మరో భారీ షాట్ ఆడే క్రమంలో రోహిత్ ఔట్ కాగా.. సూర్యకుమార్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. మరో ఎండ్ నుంచి వేగం పెంచిన విరాట్ 4,6తో ప్రపంచకప్‌లో వరుసగా రెండో అర్ధశతకం తన పేరిట రాసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్‌తో సూర్యకుమార్ కూడా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాగా.. స్టార్లతో నిండిన బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించడంలో నెదర్లాండ్స్ బౌలర్లు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. ఇక లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ఏ స్థాయిలోనూ పోటీలో నిలువలేకపోయింది. మన బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది.
స్కోరు బోర్డు
భారత్: రాహుల్ (ఎల్బీ) మికెరన్ 9, రోహిత్ (సి) అకెర్మన్ (బి) క్లాసెన్ 53, కోహ్లీ (నాటౌట్) 62, సూర్యకుమార్ (నాటౌట్) 51, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 179/2. వికెట్ల పతనం: 1-11, 2-84, బౌలింగ్: క్లాసెన్ 4-0-33-1, ప్రింగ్లె 4-0-30-0, మికెరన్ 4-0-32-1, లీడ్ 3-0-33-0, వాన్ బీక్ 4-0-45-0, షారిజ్ 1-0-5-0.
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ (బి) భువనేశ్వర్ 1, డౌడ్ (బి) అక్షర్ 16, లీడ్ (సి) పాండ్యా (బి) అక్షర్ 16, అకెర్మన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 17, కూపర్ (సి) (సబ్) హుడా (బి) అశ్విన్ 9, ఎడ్వర్ట్స్ (సి) (సబ్) హుడా (బి) భువనేశ్వర్ 5, ప్రింగ్లె (సి) కోహ్లీ (బి) షమీ 20, వాన్ బీక్ (సి) కార్తీక్ (బి) అర్శ్‌దీప్ 3, షారిజ్ (నాటౌట్) 16, క్లాసెన్ (ఎల్బీ) అర్శ్‌దీప్ 0, మికెరన్ (నాటౌట్) 14, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 123/9. వికెట్ల పతనం: 1-11, 2-20, 3-47, 4-62, 5-63, 6-87, 7-89, 8-101, 9-101, బౌలింగ్: భువనేశ్వర్ 3-2-9-2, అర్శ్‌దీప్ 4-0-37-2, షమీ 4-0-27-1, అక్షర్ 4-0-18-2, పాండ్యా 1-0-9-0, అశ్విన్ 4-0-21-2.