నిరుడు టీ20 వరల్డ్ కప్ చాంపియన్స్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టు.. ఏడాది తిరగకముందే మరో ఐసీసీ ట్రోఫీనీ సొంతం చేసుకుంది. మినీ ప్రపంచకప్‌గా భావించే ‘చాంపియన్స్ ట్రోఫీ’ని టీమ్ఇండియా 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్ పోరులోనూ అదే జోరును కొనసాగించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా నిలిచి దుబాయ్‌లో తీన్మార్ కొట్టింది. భారత స్పిన్నర్ల ధాటికి తక్కువ స్కోరుకే తోకముడిచిన కివీస్.. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు శ్రేయాస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో తలవంచక తప్పలేదు. ఈ విజయంతో భారత్.. 25 ఏండ్ల క్రితం (2000లో) ఇదే ట్రోఫీలో కివీస్ చేతిలోనే ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
Champions Trophy | దుబాయ్: పుష్కరకాల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భారత్ వశమైంది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడిన రోహిత్ సేన.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీనీ కైవసం చేసుకుంది. టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన టీమ్ఇండియా.. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన స్పిన్ థ్రిల్లర్‌లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా నిలిచింది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో భారత్‌నే విజయం వరించింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనలో రోహిత్ (83 బంతుల్లో 76, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగగా మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి మెన్ ఇన్ బ్లూను విజేతలుగా నిలబెట్టారు. అంతకుముందు భారత స్పిన్ మాంత్రికులు వరుణ్ చక్రవర్తి (2/45), కుల్దీప్ యాదవ్ (2/40), రవీంద్ర జడేజా (1/30), అక్షర్ (0/29) కట్టడి చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులకే పరిమితమైంది. డారిల్ మిచెల్ (101 బంతుల్లో 63, 3 ఫోర్లు), మైఖేల్ బ్రాస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. రోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రచిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి.
టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి 7 ఓవర్లు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత 43 ఓవర్లు మరో ఎత్తు. వరుణ్, కుల్దీప్, జడేజా, అక్షర్ మాయాజాలంలో చిక్కుకుని కివీస్ రెక్కతెగిన కివీ పక్షిలా విలవిల్లాడింది. పది కాదు.. ఇరవై కాదు.. ఈ నలుగురూ కలిసి నిరాటంకంగా 35 ఓవర్లు (మొత్తం 38) వేసి న్యూజిలాండ్‌ను కోలుకోనీయలేదు. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37, 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత పేస్ ద్వయం షమీ, హార్దిక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పేసర్లతో లాభం లేదని గ్రహించిన రోహిత్.. ఆరో ఓవర్లోనే వరుణ్‌ను బరిలోకి దింపాడు. అతడు తన రెండో ఓవర్లోనే ఓపెనర్ విల్ యంగ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని కివీస్ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ జట్టు కట్టడికి ఇదే తొలి మెట్టు. ఇదే ఊపులో రోహిత్.. 11 ఓవర్లో కుల్దీప్‌నకు బంతినిచ్చాడు. అతడు తొలి బంతినే గూగ్లీతో రచిన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడమే గాక తన మరుసటి ఓవర్లో రెండో బంతికి ప్రమాదకర కేన్ విలియమ్సన్ (11)నూ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. రచిన్, విలియమ్సన్ నిష్క్రమించేటప్పటికీ (12.2 ఓవర్లలో) 75/3గా ఉన్న కివీస్ స్కోరు ఆ తర్వాత క్రమంగా నెమ్మదించింది.
విలియమ్సన్ స్థానంలో వచ్చిన లాథమ్ (14), మిచెల్‌తో కలిసి 11 ఓవర్లు ఆడి 33 పరుగులే జోడించాడు. పట్టుదలతో క్రీజులో నిలిచిన లాథమ్‌ను జడేజా 24వ ఓవర్లో ఎల్బీగా వెనక్కిపంపడంతో కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో మిచెల్‌కు జతకలిసిన ఫిలిప్స్ సింగిల్స్ తీసినా వేగంగా ఆడలేకపోయారు. మిచెల్ అయితే వికెట్ ఇవ్వకూడదన్న పట్టుదలతో ఆడటంతో రన్‌రేట్ నెమ్మదించింది. ఐదో వికెట్‌కు 87 బంతుల్లో 57 పరుగులు జతచేసి ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని విడదీయడానికి రోహిత్.. మళ్లీ వరుణ్‌కే బంతిని అందించాడు. 38వ ఓవర్లో అతడు వేసిన గూగ్లీ.. మిడిల్ వికెట్‌ను గిరాటేయడంతో ఫిలిప్స్ నిష్క్రమించాడు. మిచెల్ ఎట్టకేలకు 91 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. 12 ఓవర్లకే 75 పరుగులు చేసిన కివీస్.. 200 పరుగుల మార్కును 45వ ఓవర్లో అందుకుంది. ఫిఫ్టీ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో మిచెల్.. షమీ వేసిన 46వ ఓవర్లో రెండు బౌండరీలు బాదినా నాలుగో బంతికి ఓవర్ ఎక్స్ట్రా కవర్ వద్ద రోహిత్ చేతికి చిక్కాడు. కానీ ఆఖర్లో బ్రాస్‌వెల్ వేగంగా ఆడి 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు 67 పరుగులు రాబట్టింది.
స్పిన్నర్లకు విపరీతంగా సహకరించిన స్పిన్ పిచ్‌పై ఛేదన అంత ఈజీ కాదని టీమ్ఇండియా అభిమానులు భావించినా రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు మిడిలార్డర్లో శ్రేయాస్, అక్షర్ నిలకడ ఆఖర్లో రాహుల్‌తో భారత్ విజయతీరాలకు చేరింది. ఎదుర్కున్న రెండో బంతినే స్కేర్ లెగ్ దిశగా సిక్సర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన హిట్‌మ్యాన్ ఒరూర్క్ రెండో ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు.స్మిత్ ఆరో ఓవర్లో రెండో బంతిని 92 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. అతడే వేసిన 8వ ఓవర్లో 6, 4, 4తో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో గిల్ (50 బంతుల్లో 31, 1 సిక్స్) నెమ్మదిగా ఆడినా రోహిత్ దూకుడుతో భారత రన్‌రేట్ 6కు పైనే నమోదైంది. సాంట్నర్ కూడా స్పిన్నర్లతో దాడి చేయించడంతో భారత స్కోరు వేగం నెమ్మదించింది.
సాంట్నర్ 11వ ఓవర్లో తొలి బంతికి డీప్ కవర్ దిశగా సింగిల్ తీసిన రోహిత్.. 41 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తిచేశాడు. అయితే సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌లో సాంట్నర్ చిన్న కుదుపు తెచ్చాడు. అతడి 19వ ఓవర్లో గిల్ ఎక్స్ట్రా కవర్ వద్ద కొట్టిన బంతిని ఫిలిప్స్ సూపర్ మ్యాన్ రేంజ్లో పైకెగిరి క్యాచ్ పట్టడంతో 105 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లోనే బంతిని అందుకున్న బ్రాస్‌వెల్.. కోహ్లీ (1)ని వికెట్ల ముందు బలిగొనడంతో భారత్ ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రచిన్ వేసిన 27వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయిన హిట్‌మ్యాన్.. స్టంపౌట్ అయ్యాడు.
17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి గురైన భారత ఇన్నింగ్స్‌ను శ్రేయాస్, అక్షర్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ అనవసర షాట్లకు పోకుండా లక్ష్యాన్ని వడివడిగా కరిగించారు. రోహిత్ మాదిరిగానే సాంట్నర్ సైతం వరుసగా స్పిన్నర్లతో దాడి చేయించడంతో రన్‌రేట్ కాస్త తగ్గినా ఈ ద్వయం నిలకడగా పరుగులు రాబట్టింది. ఫిలిప్స్ 37వ ఓవర్లో మూడో బంతికి భారీ సిక్సర్ కొట్టిన అయ్యర్.. తర్వాతి బంతికే లాంగాన్ వద్ద జెమీసన్ క్యాచ్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సాంట్నర్ 39వ ఓవర్లో స్కేర్ లెగ్ వద్ద రచిన్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. 61 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయాస్, అక్షర్ నిష్క్రమించే సమయానికి భారత విజయానికి 49 పరుగులు అవసరమవగా ఆఖర్లో రాహుల్ మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ (18, 1 ఫోర్, 1 సిక్స్),జడేజా (9 నాటౌట్, 1 ఫోర్) అండతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
భారత క్రికెట్ జట్టు కీర్తికిరీటంలో మరో కలికుతురాయి చేరింది. సుదీర్ఘ దేశ క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్న టీమ్ఇండియా మరో అపురూప సందర్భంతో కోట్లాది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. రెండేండ్ల క్రితం సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో అనూహ్య పరాజయంతో వన్డే ప్రపంచకప్ టైటిల్ చేజార్చుకున్న భారత్..మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో తీన్మార్తో దుమ్మురేపింది. సరిగ్గా 12 ఏండ్ల క్రితం మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా పుష్కరకాలం తర్వాత ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ప్రపంచ క్రికెట్‌పై టీమ్ఇండియా చెరగని ముద్ర వేసింది. బంగ్లాదేశ్‌తో మొదలైన టీమ్ఇండియా విజయ ప్రస్థానం ఆఖరి వరకు దిగ్విజయంగా సాగింది. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లా భరతం పట్టిన రోహిత్‌సేన..మలి పోరులో దాయాది పాకిస్థాన్‌ను పాతరేసింది. పదునైన పేస్‌తో పాక్ భయపెట్టాలని చూసినా..
అంతే దీటుగా దుర్బేధ్యమైన బ్యాటింగ్‌తో బదులిచ్చింది. పాక్‌తో మ్యాచ్ అంటే పూనకం వచ్చినట్లు ఆడే విరాట్ కోహ్లీ మరోమారు సూపర్ సెంచరీతో కదంతొక్కిన వేళ భారత్ విజయగర్వంతో సంబురాలు చేసుకుంది. ఆ తర్వాత కొరకరాని కొయ్యగా మారిన కివీస్‌కు టీమ్ఇండియా చెక్ పెట్టింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలంతో కివీస్ వరుస విజయాలకు ఫుల్స్టాప్ పెట్టింది. కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ అడ్డుకున్న తీరు అమోఘం. కోహ్లీ, అయ్యర్, రాహుల్, హార్దిక్ బ్యాటింగ్‌తో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. కివీస్‌తో కీలకమైన ఫైనల్లోనూ భారత్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా స్పిన్ తంత్రంతో కివీస్‌ను కట్టడి చేసిన మనోళ్లు..ఆఖరి వరకు పోరాడిన తీరు నభూతో నభవిష్యత్. కెప్టెన్ రోహిత్‌శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదిరిపోయే ఆరంభాన్నివ్వగా, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ అద్భుత ముగింపునిచ్చారు. మొత్తంగా లార్డ్స్‌లో ఏడేండ్ల క్రితం ఎదురైన చేదు జ్ఞాపకానికి దుబాయ్‌లో చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత్ అద్భుత ముగింపు పలికింది.
వరుసగా మ్యాచ్‌లు గెలుస్తున్నా టాస్ విషయంలో భారత సారథి రోహిత్‌ను అదృష్టం వెక్కిరిస్తూనే ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ అతడు టాస్ ఓడిపోయాడు. వన్డేలలో ఇలా జరగడం రోహిత్‌కు ఇది 12వ సారి కాగా భారత జట్టుకు 15వది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో మొదలైన ఈ పరంపర చాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులోనూ కొనసాగింది. ఈ క్రమంలో రోహిత్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేలలో అత్యధికసార్లు టాస్ ఓడిపోయిన సారథుల్లో హిట్‌మ్యాన్.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను సమం చేశాడు. లారా.. 1998-1999 మధ్య వరుసగా 12 టాస్‌లు ఓడాడు.
న్యూజిలాండ్ : 50 ఓవర్లలో 251/7 (మిచెల్ 63, బ్రాస్‌వెల్ 53 నాటౌట్, కుల్దీప్ 2/40, వరుణ్ 2/45);
భారత్ : 49 ఓవర్లలో 254/6 (రోహిత్ 76, శ్రేయాస్ 48, బ్రాస్‌వెల్ 2/28, సాంట్నర్ 2/16)
ఆధునిక భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్, కోహ్లీకి ఇది నాలుగో ఐసీసీ ట్రోఫీ విజయం. రోహిత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలలో సభ్యుడు కాగా కోహ్లీ 2011 వన్డే ప్రపంచకప్, 2013, 2024, 2025లలో ట్రోఫీలు గెలిచిన జట్టులో కీలకపాత్ర పోషించాడు.
ప్రైజ్‌మనీ విజేత: 20 కోట్లు
రన్నరప్: 9.72 కోట్లు
2 ధోనీ తర్వాత భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి రోహిత్.
3 2002, 2013 తర్వాత భారత్‌కు ఇది మూడో చాంపియన్స్ ట్రోఫీ. 2002లో శ్రీలంకతో సంయుక్తంగా విజేతగా నిలిచిన భారత్.. ఈ టోర్నీని ఆస్ట్రేలియా తర్వాత అత్యధిక సార్లు (2) గెలుచుకున్న జట్టుగా రికార్డుల కెక్కింది.
7 భారత్ సాధించిన ఐసీసీ ట్రోఫీలు. ఆస్ట్రేలియా (10) తర్వాత అత్యధిక ట్రోఫీలు సాధించిన జట్టు టీమ్ఇండియానే. విండీస్ (5) మూడో స్థానంలో ఉంది.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియాకు శుభాకాంక్షలు. ఇది పూర్తిగా జట్టు సమిష్టి పోరాటం. గెలుపు కోసం కివీస్ కడదాకా పోరాడిన తీరు అమోఘం. సూపర్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కిన కెప్టెన్ రోహిత్, సిరీస్‌లో అదరగొట్టిన కోహ్లీకి అభినందనలు. ఫైనల్లో కివీస్‌ను కట్టడి చేయడంలో కీలకమైన స్పిన్నర్లు ఈ చిరస్మరణీయ విజయానికి ప్రత్యేక కారకులు.
అద్భుతమైన విజయం! ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ విజయంతో మెన్ ఇన్ బ్లూ క్రికెట్ ప్రపంచంపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. ఈ చిరస్మరణీయ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశం గర్వపడేలా చేసిన మన విజేతలకు అభినందనలు.