న్యూఢిల్లీ: చైనాలోని హులున్బుర్లో జరుగుతున్న ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ(ACT Hockey)లో.. భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. భారత్‌కు ఇది వరుసగా నాలుగవ విజయం. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత్, ఏసీటీ టోర్నీలో చైనా, జపాన్, మలేషియాపై విజయాలు నమోదు చేసింది. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో అరైజీత్ సింగ్ హుందాల్ 8వ నిమిషంలో, హర్మన్‌ప్రీత్ సింగ్ 9వ, 43వ నిమిషాల్లో గోల్స్ చేశారు. కొరియా తరపున జీ హున్ యాంగ్ ఓ గోల్ చేశాడు. పెనాల్టీ కార్నర్‌ను అతను గోల్‌గా మలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు శనివారం పాకిస్థాన్‌తో తలపడనున్నది. టాప్ నాలుగు జట్లు సెమీస్‌లో పోటీపడుతాయి.