Champions Trophy | రాజ్‌గిర్ (బీహార్): మహిళల హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. బుధవారం రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ 1-0తో చైనాను ఓడించి వరుసగా రెండోసారి ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)ని సొంతం చేసుకుంది. చైనాతో ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో భారత్ తరఫున ఈ టోర్నీలో అత్యధిక గోల్స్(11) చేసిన యువ స్ట్రైకర్ దీపికా 31వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయంలో కీలకపాత్ర పోషించింది.
ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా అజేయంగా నిలిచిన భారత్‌కు ఏసీటీని దక్కించుకోవడం 2016, 2023 తర్వాత ఇది మూడోసారి కాగా రన్నరప్‌గా నిలవడం చైనాకూ ఇది మూడో సారే కావడం గమనార్హం. గతంలో దక్షిణకొరియా మాత్రమే మూడు ట్రోఫీలు సాధించింది. ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరులో జపాన్ 4-1తో మలేషియాను ఓడించింది.
లీగ్ దశలో చైనాను 3-0తో ఓడించినా ఫైనల్లో మాత్రం డ్రాగన్ అంత తేలిగ్గా లొంగలేదు. ఆట అర్ధభాగం ముగిసేసరికి ఇరు జట్లు గోల్ లేకుండా నిలిచాయి. రెండు జట్లూ డిఫెన్స్, అటాకింగ్‌లో ఒకరిని మించి ఒకరన్నట్టుగా పోరాడాయి. ఈ టోర్నీలో పెనాల్టీ కార్నర్ (పీసీ)లను సద్వినియోగం చేసుకోలేక తంటాలుపడ్డ భారత్.. ఫైనల్లోనూ అదే సమస్యలు ఎదుర్కొంది. రెండో క్వార్టర్ ఆరంభంలో చైనాకు తొలి పీసీ అవకాశం వచ్చినా యువ గోల్ కీపర్ బిచు దేవి అద్భుతంగా అడ్డుకుంది.
ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్ చాన్స్‌లు వచ్చాయి. కానీ మన అమ్మాయిలు వాటిలో ఒక్కదానినైనా గోల్‌గా మలచలేకపోయారు. ఇక మూడో క్వార్టర్ ఆరంభమైన కాసేపట్లోనే దీపిక రాకెట్ వేగంతో కొట్టిన గోల్‌తో భారత్ ఊపిరి పీల్చుకుంది. 42వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ అవకాశం రాగా దీపిక కొట్టిన బంతిని చైనా గోల్‌కీపర్ సమర్థవంతంగా అడ్డుకుంది. తర్వాత ఇరు జట్లూ గోల్ కోసం ప్రయత్నించినా విజయవంతం కాలేకపోయాయి.