Sultan Azlan Shah Cup : మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ (Sultan Azlan Shah Cup)లో ఆదరగొడుతున్న భారత హాకీ జట్టు ఫైనల్ చేరింది. లీగ్ దశ నుంచి గోల్స్ వర్షంతో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వచ్చిన టీమిండియా కెనడా (Candaa)ను భారీ తేడాతో చిత్తు చేసింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో డిఫెండర్లు, ఫార్వర్డ్స్ సమిష్టిగా రాణించగా 14-3తో ప్రత్యర్థిని ఓడించి రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా.. ట్రోఫీ కోసం ఆదివారం బెల్జియంతో తలపడనుంది.
ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో భారత జట్టు 14-3తో కెనడాను చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే నీలకంఠ శర్మ గోల్ అందించాడు. కాసేపటికే రాజేందర్ సింగ్ గోల్ సాధించాడు. 2-0తో టీమిండియా ఆధిక్యంలో ఉండగా.. 11వ నిమిషంలో కెనడా ప్లేయర్ బ్రెండన్ గురాలిక్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే.. ప్రత్యర్థికి షాకిస్తూ ఫార్వర్డ్ ఆటగాళ్లు జుగురాజ్ సింగ్, అమిత్ రోహిదాస్‌లు తలొక గోల్ చేయగా తొలి అర్ధభాగంలో భారత్ 4-1తో ఆధిక్యం కనబరిచింది.
🆙 𝐍𝐄𝐗𝐓, 𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋!!! 👊
India storm into the finals after a massive 14–3 win against Canada at the 31st Sultan Azlan Shah Cup 2025! ⚡#HockeyIndia #IndiaKaGame pic.twitter.com/9mbxbi9Qr3
— Hockey India (@TheHockeyIndia) November 29, 2025
రెండో క్వార్టర్స్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు జోరు చూపించారు. మూడో అర్ధ భాగంలో కెనడా మరో గోల్ చేసినా… అప్పటికే భారత్ 9-2తో ముందంజలో ఉంది. 56వ నిమిషంలో సంజయ్, 57, 59 నిమిషాల్లో అభిషేక్ రెండు గోల్స్‌తో మెరిశాడు. దాంతో.. 14-3తో కెనడాను మట్టికరిపించిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో బెల్జియం చేతిలో కంగుతిన్న హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. 1985, 1991, 1995, 2009, 2010లో ఛాంపియన్‌గా కప్‌ను అందుకున్న భారత్.. 2008, 2016, 2019 ఎడిషన్లలో మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకుంది.