IND vs BAN | రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకు పోయినా ఒక టెస్టులో మరో సగం రోజు మిగిలుండగానే విజయం సాధించొచ్చని ఎవరైనా ఊహించారా? ఆరు సెషన్లు మాత్రమే సాగిన మ్యాచ్‌లో ఫలితం రాబట్టొచ్చని ఎవరైనా అంచనా వేశారా? ఓ జట్టు 52 ఓవర్లలోనే టెస్టును గెలుచుకోవడం ఎప్పుడైనా చూశారా? కానీ కాన్పూర్‌లో భారత క్రికెట్ జట్టు ఆ అసాధ్యాలన్నింటినీ సుసాధ్యం చేసింది. తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యమై తర్వాత రెండ్రోజుల్లో ఒక్క బంతీ పడకపోయినా నాలుగో రోజు అనూహ్య ఆటతీరుతో మ్యాచ్‌ను తమ వైపునకు లాగేసుకున్న టీమ్ఇండియా.. ఆట చివరి రోజు అసాధారణ ఆటతీరుతోఅద్భుతమే చేసింది. నాలుగో రోజు ప్రత్యర్థి జట్టుకు బ్యాట్‌తో చుక్కలు చూపించిన రోహిత్ సేన.. మంగళవారం బంతితో ఆటాడుకుంది. వీలైనంత త్వరగా బంగ్లాను ఆలౌట్ చేయాలన్న కసితో ఆడిన భారత్‌కు బుమ్రా, జడ్డూ రాణించడంతో తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత పర్యాటక జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఊదిపారేసి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడమే గాక స్వదేశంలో వరుసగా 18వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కాన్పూర్: అద్భుతం.. అసాధారణం.. అపూర్వం.. కాన్పూర్ టెస్టులో భారత ప్రదర్శన గురించి చెప్పడానికి ఇలాంటి ఉపమానాలెన్ని వాడినా సరిపోదు. వర్షం, ఇతరత్రా కారణాల రీత్యా రెండున్నర రోజుల ఆట కోల్పోయిన మ్యాచ్‌లో టీమ్ఇండియా.. ఐదో రోజు మరో సెషన్ మిగిలుండగానే సగర్వంగా విజయాన్ని ముద్దాడింది. ఆట చివరి రోజు బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల ఛేదనను 17.2 ఓవర్లలోనే పూర్తిచేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (45 బంతుల్లో 51, 8 ఫోర్లు, 1 సిక్సర్), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (37 బంత్లులో 29 నాటౌట్, 4 ఫోర్లు) వేగంగా ఆడారు. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ షద్మన్ ఇస్లాం (50) అర్ధ సెంచరీతో ఆదుకోగా ముష్ఫీకర్ రహీమ్ (37) ఫర్వాలేదనిపించాడు. బుమ్రా (3/17), జడేజా (3/34), అశ్విన్ (3/50) తలా మూడు వికెట్లతో పర్యాటక జట్టు వెన్ను విరిచారు. మ్యాచ్‌లో రెండు అర్ధ సెంచరీలు చేసిన యశస్వీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా సిరీస్ ఆసాంతం రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ వరించింది.
చివరి రోజు ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన మూడో ఓవర్లోనే అందుకు శ్రీకారం చుట్టింది. ఓవర్ నైట్ స్కోరు 26/2 వద్ద ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా.. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మొమినుల్ హక్ (2) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. అశ్విన్ వేసిన బంతిని స్వీప్ చేయబోయిన అతడు.. లెగ్ స్లిప్‌లో రాహుల్ చేతికి చిక్కాడు. అయితే కెప్టెన్ శాంతో (19) తో కలిసి షద్మన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నం చేశాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 55 పరుగులు జతచేసింది. కానీ డ్రింక్స్ తర్వాత రెండో ఓవర్లో జడేజా.. అద్భుతమైన బంతితో శాంతోను బోల్తా కొట్టించాడు. రివర్స్ స్వీప్ ఆడబోయిన శాంతో బంతి మిస్ అవడంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న షద్మన్ను ఆ మరుసటి ఓవర్లోనే ఆకాశ్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. లిటన్ దాస్ (1), షకిబ్ సైతం జడ్డూ మాయాజాలానికి బలయ్యారు. మిరాజ్‌ను బుమ్రా ఔట్ చేయడంతో బంగ్లా ఆశలు వదులుకుంది. లంచ్ విరామానికి వెళ్లేముందు బుమ్రా వేసిన 46వ ఓవర్ చివరి బంతికి ముష్ఫీకర్ కూడా బౌల్డ్ అవడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.
బంగ్లా నిర్దేశించిన 95 పరుగుల ఛేదనను భారత్ ధాటిగానే మొదలుపెట్టింది. యశస్వీ రెండో ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. కానీ రోహిత్ (8), శుభ్‌మన్ గిల్ (6) నిరాశపరిచారు. ఈ ఇద్దరూ మిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి యశస్వీ భారత్‌ను లక్ష్యం వైపునకు నడిపించాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఫిఫ్టీకి చేరువైన యశస్వీ.. అతడే వేసిన 16వ ఓవర్లో సింగిల్ తీసి ఈ మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కానీ భారత విజయానికి 4 పరుగుల దూరంలో ఉండగా భారీ షాట్ ఆడబోయి షకిబ్ అల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీతో కలిసి పంత్ (4 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
భారత్‌కు ఇది వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకూ ఈ రికార్డు లేదు. 2012 తర్వాత టీమ్ఇండియా సొంతగడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా కోల్పోలేదు. చివరిసారిగా 2012-13లో ఇంగ్లండ్ చేతిలో ఓడాక గడిచిన 12 ఏండ్లలో ఒకటీ, అరా టెస్టు మ్యాచ్‌లు ఓడటం మినహా సిరీస్‌లు కోల్పోయిన దాఖలాల్లేవు. ప్రపంచ క్రికెట్లో దిగ్గజ జట్లకూ ఈ ఘనత లేదు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (10 టెస్టు సిరీస్‌లు- 1994-2000 దాకా, 2004-2008 దాకా), వెస్టిండీస్ (8, 1976-1986) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుమారుగా 4,300 రోజులకు పైగా భారత్ స్వదేశంలో అజేయంగా కొనసాగుతోంది. 2013 నుంచి సొంతగడ్డపై 53 టెస్టులు ఆడిన మెన్ ఇన్ బ్లూ.. ఏకంగా 42 మ్యాచ్‌లలో గెలిచి 4 టెస్టులను మాత్రమే కోల్పోయింది. ఏడు డ్రాగా తేలాయి.
బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసుకు భారత్ మరింత చేరువైంది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా.. 74.24 శాతంతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ సైకిల్లో మరో 8 మ్యాచ్‌లు (స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5) ఆడనున్న రోహిత్ సేన.. మూడింటిలో గెలిచినా వరుసగా మూడోసారి ఫైనల్స్ ఆడుతుంది.
1 టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఓ జట్టు అత్యధిక రన్‌రేట్ (7.36 భారత్) నమోదు చేయడం ఇదే ప్రథమం.
1 టెస్టులలో ఒక్క మెయిడిన్ కూడా లేకుండా గెలిచిన జట్టు భారత్. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క బంగ్లా బౌలర్ కూడా మెయిడిన్ ఓవర్ వేయలేదు.
4 ప్రపంచ క్రికెట్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన జట్లలో భారత్ (180) నాలుగో స్థానంలో ఉంది. ఆసీస్, ఇంగ్లండ్, విండీస్ మనకంటే ముందున్నాయి.
11 టెస్టుల్లో అశ్విన్ సాధించిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు. ఈ క్రమంలో అతడు మురళీధరన్ (శ్రీలంక)ను సమం చేశాడు.
బంగ్లా తొలి ఇన్నింగ్స్ : 233 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్
బంగ్లా రెండో ఇన్నింగ్స్ : 146 ఆలౌట్ (షద్మాన్ 50, ముష్ఫీకర్ 37, బుమ్రా 3/17, జడేజా 3/34)
భారత్ రెండో ఇన్నింగ్స్: 98/3 (యశస్వీ 51, కోహ్లీ 29 నాటౌట్, మిరాజ్ 2/44)