India-Bangladesh : ఇటీవలి కాలంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై అనుమానాలు తలెత్తాయి. ఈ అంశం ప్రభావం ముందుగా ఇరు దేశాల మధ్య క్రికెట్ పై పడింది. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడిని బీసీసీఐ తొలగిస్తే.. ఇండియాలో వచ్చే నెలలో జరగబోయే టీ20లో పాల్గొనబోమని బంగ్లా చెప్పింది.
ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలహీనమయ్యాయి. ఇదే వివాదం ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ పై కూడా పడింది. శనివారం రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచు సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచుకు ముందు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. ఇండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రర్ టాస్ సందర్భంగా పక్కపక్కనే నిలబడ్డా చేతులు కలపలేదు. దీంతో ఈ అంశం చర్చకు దారితీసింది. సాధారణంగా టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ, శనివారం టాస్ సందర్భంగా ఇది జరగలేదు. దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. ఇది అనుకోకుండా జరిగిందని ఆ జట్టు బోర్డు తెలిపింది.
అయితే, ఈ అంశానికి మ్యాచ్ అనంతరం తెరపడింది. ఈ మ్యాచులో ఇండియా గెలిచింది. తర్వాత ఎప్పట్లాగే ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది. ఇక.. అనారోగ్యం కారణంగా బంగ్లా కెప్టెన్ టాస్ కు రాలేదు. గత ఏడాది ఆసియా కప్ సందర్భంగా ఇండియా-పాక్ ఆటగాళ్లు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోని సంగతి తెలిసిందే.