భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది. ఇంగ్లండ్ గడ్డపై ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న టెస్టు సిరీస్‌ను ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. దిగ్గజ త్రయం రోహిత్, కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు వేళ అంతగా అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగుతున్న టీమ్ఇండియా..శుక్రవారం నుంచి లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో పోటీపడబోతున్న భారత్‌కు అనుభవలేమి ప్రతిబంధకంగా కనిపిస్తున్నది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల ద్వారా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టు కూర్పుపై దృష్టి సారించింది. ఎవరిని ఏ స్థానంలో ఆడించాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నది.
భారత క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికకు తోడు దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ క్రికెటర్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా టీమ్ఇండియాకు ఎంపికైన యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకుంటూ సత్తాచాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా టీమ్ఇండియాకు తొలిసారి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవైపు కెప్టెన్సీ బాధ్యతలకు తోడు కీలకమైన బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఏర్పడింది.
అంతోఇంతో ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవమున్న కేఎల్ రాహుల్, బుమ్రా, సిరాజ్, పంత్, జడేజా పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో తొలి టెస్టు సిరీస్ అయిన ఇంగ్లండ్‌తో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నది. చీఫ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శకత్వంలో ఇంగ్లిష్ జట్టును దీటుగా ఎదుర్కొవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డ క్రికెటర్లు తొలి టెస్టుకు వేదికైన లీడ్స్‌లో సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నారు. అయితే తుది జట్టు కూర్పుపై ఒకింత ఆసక్తి నెలకొన్నది.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్‌కు తోడు కేఎల్ రాహుల్ వచ్చే అవకాశముంది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ ఆడబోతున్న జైస్వాల్ ఏ మేరకు జట్టుకు శుభారంభం అందిస్తాడన్నది చూడాలి. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు 27.50 సగటుతో 110 రన్స్ చేశాడు. ఇంట్రాస్కాడ్ పోరులోనూ జైస్వాల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు ప్రస్తుత టీమ్‌లో సీనియర్ అయిన రాహుల్‌కు ఇంగ్లండ్‌లో 34.11 సగటు ఉంది. 2018(ఓవల్)లో 149కు తోడు, 2021లో 129 పరుగులు చేసిన అనువభం రాహుల్ సొంతం. దీనికి తోడు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రాహుల్ భారీ అంచనాలు కల్పించాడు.
జైస్వాల్, రాహుల్ జట్టుకు మెరుగైన శుభారంభాన్ని ఇస్తే టీమ్ఇండియాకు తిరుగుండకపోవచ్చు. కీలకమైన మూడో స్థానం కోసం సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ మధ్య పోటీ ఏర్పడింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పరుగుల వరద పారించిన సుదర్శన్‌కు కౌంటీల్లో ఆడిన అనుభవం కలిసొచ్చే అంశం. దేశవాళీలో టన్నుల కొద్ది పరుగులు చేసి దాదాపు 7 ఏండ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన కరణ్‌ను ఎక్కడ ఆడించాలన్నదానిపై టీమ్ మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నది. కౌంటీల్లో ఆడిన అనుభమున్న కరణ్ తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (204) చేసి తన వాడిని చూపించాడు.
మరోవైపు దేశవాళీల్లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టులో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఈశ్వరన్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా 41.75 సగటుతో 167 పరుగులు చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానాన్ని కెప్టెన్ గిల్ భర్తీ చేయనున్నాడు. టాపార్డర్ విఫలమైతే ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారుతూ ఆటను చక్కదిద్దాల్సిన కీలక బాధ్యత గిల్ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇక ఐదో స్థానంలో రిషభ్ పంత్ రానున్నాడు. మిడిలార్డర్లో పంత్ దూకుడు టీమ్ఇండియాకు కలిసిరానుంది. సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 37 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు చేసిన అనుభవం పంత్ సొంతం.
లోయార్డర్‌లో జడేజా ఆట చాలా కీలకం కానుంది. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉన్న జడేజా క్లిష్టమైన సమయాల్లో జట్టకు ఆపద్భాంవునిలా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. పేస్ ఆల్‌రౌండర్ విషయానికొస్తే శార్దుల్ ఠాకూర్, నితీశ్‌కుమార్ మధ్య పోటీ నెలకొన్నది. ఇంట్రాస్కాడ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శార్దుల్ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దీనికి తోడు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం శార్దుల్‌కు అదనపు బలం కానుండగా, నితీశ్ స్థానంపై సందిగ్ధత నెలకొన్నది.
పేస్ దళానికి జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టులు ఆడబోతున్న బుమ్రా..ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడంలో చాలా కీలకం కానున్నాడు. వేగానికి తనదైన స్వింగ్ జోడిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడంలో ఆరితేరిన బుమ్రా..టీమ్ఇండియాకు తురుపుముక్క. ఆదిలోనే ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తే..మిగతాపనిని సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కానిచ్చే అవకాశముంది. ఫిట్నెస్ సమస్యలకు తోడు పేస్ భారాన్ని అంచనా వేస్తూ బుమ్రాను సిరీస్‌లో బరిలోకి దింపాల్సిన అవసరముంది. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత పేస్ బౌలింగ్‌కు పిల్లర్‌గా భావిస్తున్న సిరాజ్ విరామం లేకుండా బౌలింగ్ చేయడంలో దిట్ట. ఐపీఎల్ లోమెరుపులు మెరిపించిన ప్రసిద్ధ్ సత్తాచాటితే టీమ్ఇండియా బౌలింగ్ కష్టాలు తీరినట్లే. వీరికి తోడు అర్ష్‌దీప్‌సింగ్, ఆకాశ్‌దీప్, కుల్దీప్యాదవ్ జతకలిస్తే భారత సుదీర్ఘ కల నెరవేరినట్లే.