IND vs NZ 1st Test | 13, 2, 0, 0, 20, 0, 0, 0.. ఇవీ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లుగా వెలుగొందుతున్న భారత స్టార్ బ్యాటర్ల స్కోరు వివరాలు. సగటు భారత క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించని ఈ అవమానకర వైఫల్యానికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రత్యక్ష సాక్ష్యమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో కివీస్ పేసర్ల ధాటికి టీమ్ఇండియా పెవిలియన్‌కు క్యూ కట్టింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, జైస్వాల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్.. ఇలా వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అత్యంత అవమానకర రీతిలో 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ పేసర్లు హెన్రీ, ఓరూర్కీ దెబ్బకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎదురునిలవలేక చతికిలపడ్డారు. భారత్‌ను అత్యల్ప స్కోరుకే పరిమితం చేసిన కివీస్.. బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతూ రెండో రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడమే గాక ఈ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.
బెంగళూరు: స్వదేశంలో తిరుగులేని జట్టుగా మన్ననలు పొందుతున్న రోహిత్ సేనకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. 92 ఏండ్ల భారత క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మొదటి రోజు ఆట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయినా రెండో రోజు ఆరంభంలో పేసర్లకు సహకరించిన పిచ్‌పై కివీస్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22) దెబ్బకు టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది.
భారత బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అవ్వగా ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రిషభ్ పంత్(20) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే (105 బంతుల్లో 91, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా విల్ యంగ్ (33) రాణించాడు.
రెండో రోజు వరుణుడు తెరిపినివ్వడంతో అనుకున్న సమయానికే ఆట ఆరంభమవగా టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత నాలుగు రోజులుగా ఇక్కడ కురిసిన వర్షాలతో చిన్నస్వామి పిచ్ అనూహ్యంగా పేసర్లకు అనుకూలించింది. దీంతో కివీస్ పేస్ త్రయం టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ వికెట్ల పండుగ చేసుకున్నారు. ఆరంభం నుంచే రోహిత్ (2)ను ఇబ్బందిపెట్టిన సౌథీ.. ఏడో ఓవర్లో భారత్‌ను తొలి దెబ్బతీశాడు.
ఆ ఓవర్ మూడో బంతికి సౌథీ వేసిన ఇన్‌స్వింగర్‌ను ముందుకొచ్చి ఆడబోయిన హిట్‌మ్యాన్.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి లెగ్‌స్టంప్‌ను పడగొట్టడంతో పెవిలియన్ చేరాడు. సుమారు 8 ఏండ్ల తర్వాత టెస్టులలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. ఓరూర్కీ 9వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో డకౌట్‌గా వెనుదిరిగాడు. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. హెన్రీ బౌలింగ్‌లో ఓ చెత్త షాట్ ఆడి ఎక్స్ట్రా కవర్ వద్ద కాన్వే ముందుకు డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్‌తో అతడి కథ ముగిసింది.
ఆ తర్వాత రిషభ్, యశస్వీ జైస్వాల్ (13) 11 ఓవర్ల పాటు వికెట్‌ను కాపాడుకున్నారు. డ్రింక్స్ తర్వాత హెన్రీ 20వ ఓవర్లో జైస్వాల్.. అజాజ్ పటేల్ చేతికి చిక్కడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదుకుంటాడనుకున్న కెఎల్ రాహుల్ కూడా సున్నాకే ఔటై నిరాశపరిచాడు. లంచ్‌కు ముందు బంతికి జడేజా (0), తర్వాతి బంతికి అశ్విన్ (0) కూడా ఔట్ అయ్యారు. కాసేపు పోరాడిన పంత్‌ను 26వ ఓవర్లో హెన్రీ ఔట్ చేయడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. లోయరార్డర్లో కుల్దీప్ (1), బుమ్రా (1), సిరాజ్ (4 నాటౌట్) కూడా భారత్‌ను 50 పరుగుల మార్కును దాటించలేకపోయారు. కివీస్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని ఆతిథ్య జట్టును 31.2 ఓవర్లలోనే పెవిలియన్‌కు సాగనంపడటంలో కీలకపాత్ర పోషించారు.
భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న రోహిత్ సేన బొక్కబోర్లా పడ్డా కివీస్ మాత్రం ఆచితూచి ఆడింది. ఓపెనర్లు కాన్వే, టామ్ లాథమ్ (17) తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఆకాశ్ దీప్‌ను పక్కనబెట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్‌కు 17 ఓవర్ల దాకా వికెట్ దక్కలేదు. ఎట్టకేలకు 18వ ఓవర్లో కుల్దీప్.. లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ మూడో స్థానంలో వచ్చిన విల్ యంగ్‌తో కలిసి కాన్వే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు. రోహిత్ పదే పదే బౌలర్లను మార్చినా ఈ ద్వయం నిలకడగా పరుగులు రాబట్టింది.
టీ విరామానికి ముందే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న కాన్వే క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని 37వ ఓవర్లో జడ్డూ విడదీశాడు. యంగ్‌ను ఔట్ చేయడంతో 75 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శతకం దిశగా సాగుతున్న కాన్వేను అశ్విన్ అధ్బుతమైన డెలివరీతో బౌల్డ్ చేయడంతో ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర (22 నాటౌట్), డారెల్ మిచెల్ (14 నాటౌట్) క్రీజులో ఉండగా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఇప్పటికే 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
స్వదేశం వేదికగా టెస్టుల్లో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు (అంతకుముందు 1987లో వెస్టిండీస్‌పై 75 పరుగులకు ఆలౌట్). ఓవరాల్‌గా టీమ్ఇండియాకు అడిలైడ్ (36 ఆలౌట్) తర్వాత ఇది మూడో అత్యల్ప స్కోరు. ఆసియాలోనూ ఇదే చెత్త రికార్డు.
భారత ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన బ్యాటర్లు.
సొంతగడ్డపై టెస్టులు ఆడుతూ టాప్-7 బ్యాటర్లలో నలుగురు డకౌట్ అవడం ఇదే ప్రథమం.
భారత్: 31.2 ఓవర్లలో 46 ఆలౌట్ (పంత్ 20, జైస్వాల్ 13, హెన్రీ 5/15, ఓరూర్కీ 4/22)
న్యూజిలాండ్ : 50 ఓవర్లలో 180/3 (కాన్వే 91, యంగ్ 33, జడేజా 1/28, అశ్విన్ 1/46)