న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి.. వరుసగా రెండోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గురువారం మహిళల క్వాలిఫయింగ్ రౌండ్లో అన్ను రాణి 59.60 మీటర్ల దూరం బల్లెం విసిరి గ్రూప్-‘బి’లో ఐదో స్థానంలో నిలిచింది. తాజా సీజన్లో 63.82 మీటర్ల దూరాన్ని నమోదు చేసి జాతీయ రికార్డు నెలకొల్పిన 29 ఏండ్ల అన్ను.. శనివారం తుది పోరులో తలపడనుంది. ఇక 5000 మీటర్ల మహిళల పరుగులో పారుల్ చౌదరి క్వాలిఫయింగ్ రౌండ్‌తోనే పోరాటం ముగించింది.
ఒలింపిక్ చాంపియన్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం బరిలోకి దిగనున్నాడు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ పోటీపడనున్నాడు. టోక్యో ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తున్న నీరజ్‌కు .. ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ (చెక్ రిపబ్లిక్), వాల్కట్ (ట్రినిడాడ్) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.