IND vs ENG | నాగ్‌పూర్: మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర్ణావకాశం. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరుగనుంది. గతేడాది ఆగస్టులో శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత టీమ్ఇండియా ఆడబోయే తొలి వన్డే ఇదే. చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.
ఫోకస్ అంతా రోకో పైనే..
వన్డే ఫార్మాట్లో ఆధునిక క్రికెట్లో దిగ్గజాలుగా వెలుగొందుతూ టన్నుల కొద్ది పరుగులు, లెక్కకు మిక్కిలి రికార్డులను తమ ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించినవారిలో కోహ్లీ (765), రోహిత్ (597) టాప్-2లో ఉన్నారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరి ఫామ్ క్రమంగా దిగజారుతుండటం జట్టుకు భారీ నష్టాన్ని చేకూర్చుతోంది. ముఖ్యంగా టెస్టులలో ఈ ఇద్దరూ గత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో ఘోరంగా విఫలమయ్యారు. అదీగాక భారీ అంచనాల మధ్య సుదీర్ఘ విరామం తర్వాత రంజీలలో ఆడినా అక్కడా విఫలమయ్యరు. చాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీ ముందున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ పుంజుకోవడం భారత్‌కు అత్యావశ్యకం. ఈ ద్వయం చెలరేగితే వార్ వన్‌సైడే.
తుది కూర్పు ఎలా?
తుది జట్టులో ఎవరిని ఆడించాలనేది భారత్‌ను వేధిస్తున్న మరో సమస్య. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఓపెనర్లుగా గిల్, రోహిత్ రానుండగా ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్, హార్దిక్‌తో టాపార్డర్ అంతా రైట్ హ్యాండెడ్ బ్యాటర్లే ఉన్నారు. రాహుల్‌ను పక్కనబెట్టి పంత్‌కు చోటిస్తే బ్యాటింగ్ ఆర్డర్లో వైవిధ్యం వస్తుంది. కానీ వన్డేలలో రాహుల్ నమ్మదగిన మిడిలార్డర్ ఆటగాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అతడి ప్రదర్శనలే ఇందుకు నిదర్శనం. ఒకవేళ రాహుల్, పంత్ ఇద్దరికీ టీమ్ మేనేజ్మెంట్ ఓటు వేస్తే శ్రేయస్ బెంచ్‌కే పరిమితమవ్వక తప్పదు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు స్వల్ప విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్‌కు చాంపియన్స్ ట్రోఫీకి ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమవడానికి ఇదే మంచి అవకాశం. అయితే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కే అవకాశమున్న నేపథ్యంలో కుల్దీప్, అక్షర్, వాషింగ్టన్లలో ఎవరిని పక్కనబెడతారనేది చూడాలి.
రూట్ రీఎంట్రీ
భారత్‌తో టీ20 సిరీస్‌లో చావుదెబ్బ తిన్న ఇంగ్లండ్.. వన్డేలలో మాత్రం బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. దాదాపు టీ20లో ఆడిన జట్టుతోనే నాగ్‌పూర్‌లో బరిలోకి దిగనున్న ఇంగ్లండ్ జట్టులో.. స్టార్ బ్యాటర్ జో రూట్ రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచింది. వన్డే ప్రపంచకప్ తర్వాత రూట్ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే. డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టన్, బెతెల్ వంటి బ్యాటర్లతో ఆ జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పేస్ బాధ్యతలను జోఫ్రా ఆర్చర్, సకిబ్ మహ్ముద్ మోయనున్నారు.
తుది జట్లు
భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్) లియామ్ లివింగ్స్టన్, జాకబ్ బెతెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, సకిబ్ మహ్ముద్