బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినా పొట్టి సిరీస్‌ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యువ భారత జట్టు.. నేడు ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. బ్రిస్బేన్‌లో శనివారం జరగాల్సి ఉన్న ఐదో మ్యాచ్‌లోనూ కంగారూలకు షాకిచ్చి సిరీస్‌ను పట్టేయాలని భావిస్తున్నది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్.. సిరీస్‌ను సమం చేయాలనే ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరోసారి రసవత్తర పోరు జరుగనుండటం ఖాయంగా కనిపిస్తున్నది.
వచ్చే ఏడాది స్వదేశంలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం జట్టు కూర్పులో ప్రయోగాలు చేస్తున్న సూర్యకుమార్ సేన.. బ్రిస్బేన్‌లోనూ వాటిని కొనసాగించే అవకాశముంది. అయితే బ్యాటింగ్‌లో సమిష్టిగా బాదుతున్నా నిలకడగా ఆడుతూ వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోవడంలో స్టార్ బ్యాటర్లు విఫలమవుతున్నారు. గత మ్యాచ్‌లో ఎట్టకేలకు టచ్‌లోకి వచ్చిన వైస్ కెప్టెన్ గిల్.. ఈ సిరీస్‌లో మెరుపులతో మళ్లీ పాత ‘మిస్టర్ 360’ను గుర్తుచేస్తున్న సూర్య తక్కువ స్కోర్లకే పరిమితమవుతుండటం ఆందోళన కల్గించేదే. బ్రిస్బేన్‌లో అయినా ఈ నాయకత్వ ద్వయం ఎలా ఆడతారో చూడాలి.
అభిషేక్ బ్రిస్బేన్‌లోనూ బాదుడును కొనసాగించాలని టీమ్ ఆశిస్తున్నది. ఆసియా కప్ ఫైనల్లో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో రాణించిన తిలక్ వర్మ.. ఈ సిరీస్‌లో మాత్రం (0, 29, 5) నిరాశపరుస్తున్నాడు. దూబే, సుందర్ ఆల్‌రౌండ్ బాధ్యతలను వారి పరిమితుల మేరకు చక్కగా నిర్వర్తిస్తున్నారు. స్పిన్నర్లు వరుణ్, అక్షర్ మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. కరారాతో పోల్చితే పేస్‌కు ఎక్కువ అనుకూలించే బ్రిస్బేన్‌లో భారత పేస్ ద్వయం బుమ్రా, అర్ష్‌దీప్ చెలరేగితే సిరీస్‌ను పట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు.
ఈ మ్యాచ్‌లో ఒత్తిడంతా ఆసీస్‌పైనే ఉంది. మార్ష్ సారథిగా ఎంపికయ్యాక అప్రతీహాత విజయాలతో దూసుకెళ్తున్న ఆ జట్టు జోరుకు స్వదేశంలో భారత్ బ్రేకులు వేయడం కంగారూలకు మింగుడు పడటం లేదు. సిరీస్ నెగ్గే అవకాశం లేకపోగా బ్రిస్బేన్‌లోనూ ఓడితే ఆ జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదమున్న నేపథ్యంలో ఆ జట్టు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను తిప్పలు పెడుతున్న భారత స్పిన్నర్లపై ఆ జట్టు ప్రధానంగా దృష్టి సారించింది.