లార్డ్స్: సెషన్ సెషన్‌కూ ఆధిపత్యం చేతులు మారుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరు (387)ను సమం చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100, 13 ఫోర్లు) శతకానికి తోడు రిషభ్ పంత్ (112 బంతుల్లో 74, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72, 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో మెరవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ కూడా 387 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్‌కు లోయరార్డర్ బ్యాటర్లు, ఇంగ్లండ్‌కు బౌలర్లు రాణించి ఏ జట్టుకూ ఆధిక్యం దక్కకుండా చేశారు. ఆతిథ్య జట్టు బౌలర్లలో క్రిస్ వోక్స్ (3/84), జోఫ్రా ఆర్చర్ (2/52), బెన్ స్టోక్స్ (2/63) గిల్ సేనను కట్టడిచేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క ఓవర్ బ్యాటింగ్ చేసి వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2*), డకెట్ క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఉదయం సెషన్లో వీలైనన్ని వికెట్లు పడగొడితే మ్యాచ్ భారత్ గుప్పిట్లోకొచ్చినట్టే!
రాహుల్, పంత్ దూకుడు
ఓవర్ నైట్ స్కోరు 145/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా తొలి సెషన్లో దూకుడుగా ఆడింది. పంత్, రాహుల్ జోరు ముందు ఇంగ్లిష్ బౌలర్ల పప్పులేమీ ఉడకలేదు. ఈ ద్వయాన్ని విడదీసేందుకు గాను పదేపదే షార్ట్ పిచ్ బంతులేసినా, ఊరించే బంతులతో టెంప్ట్ చేసినా భారత జోడీ ఏకాగ్రత కోల్పోలేదు. ఆర్చర్ తొలి ఓవర్లో రెండు బౌండరీలతో పంత్ జోరు కనబరిచాడు. వేలి గాయం వేధిస్తున్నా పంత్ మాత్రం ఆ నొప్పిని దిగమింగి ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రాహుల్ ఆరంభంలో సింగిల్స్‌కే పరిమితమైనా కార్స్ 54వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో జోరందుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత స్టోక్స్ ఓవర్లో పంత్ లాంగ్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ బాది తన కెరీర్లో 17వ, ఇంగ్లండ్‌పై ఆరో అర్ధసెంచరీని పూర్తిచేశాడు. నాలుగో వికెట్‌కు 141 రన్స్ జోడించి సాఫీగా సాగుతున్న ఈ జోడీ అనవసరపు పరుగు కోసం యత్నించి విఫలమైంది. లంచ్ విరామానికి ఒక ఓవర్‌కు ముందు బషీర్ వేసిన ఓవర్లో పంత్.. మూడో బంతిని కవర్స్ దిశగా ఆడాడు. అయితే త్వరగా స్పందించడంలో అతడు విఫలమైనా.. బంతినందుకున్న స్టోక్స్ మాత్రం నేరుగా వికెట్లకు గురిపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. భోజన విరామం తర్వాత ఆర్చర్ వేసిన ఓవర్లో మిడాఫ్ దిశగా సింగిల్ తీసిన రాహుల్.. ఈ మైదానంలో రెండో, తన కెరీర్లో పదో శతకాన్ని నమోదుచేశాడు. కానీ సెంచరీ తర్వాత మరుసటి బంతికే బషీర్ బౌలింగ్‌లో అతడు స్లిప్స్‌లో బ్రూక్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
జడ్డూ, నితీశ్ ఆచితూచి..
పంత్, రాహుల్ నిష్క్రమణ తర్వాత స్కోరువేగం తగ్గింది. జడేజా, నితీశ్‌కుమార్ రెడ్డి (30) ఆచితూచి ఆడటంతో రెండో సెషన్లో పరుగుల రాక గగనమైంది. రాహుల్ స్థానంలో వచ్చిన నితీశ్.. 21 బంతుల తర్వాత ఖాతా తెరిచాడు. పెద్దగా షాట్లకు పోని ఈ ద్వయం.. సింగిల్స్‌కే పరిమితమైంది. దీంతో రెండో సెషన్లో టీమ్ఇండియా.. 25.3 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి 68 పరుగులే చేసింది. టీ విరామం తర్వాత నితీశ్.. స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నితీశ్ ఔట్ అయిన కొద్దిసేపటికి జడ్డూ.. రూట్ ఓవర్లో బౌండరీతో ఈ సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీని సాధించాడు. ఆరో వికెట్‌కు నితీశ్‌తో 72 రన్స్ జోడించిన జడ్డూ.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (23)తో కలిసి ఏడో వికెట్‌కు 50 పరుగులు జతచేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును సమం చేసే దిశగా సాగిన జడ్డూ.. వోక్స్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అతడు పెవిలియన్ చేరినా వాషింగ్టన్.. టెయిలెండర్ల అండతో స్కోరును సమం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు