కైరో (ఈజిప్ట్) : ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టి వరుసగా రెండో రోజూ పతక ప్రదర్శన చేసింది. మరో పోరులో భారత షూటింగ్లో యువ సంచలనం, పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన ఐశ్వర్య్ ప్రతాప్‌సింగ్ తోమర్ సైతం సత్తాచాటాడు. ఈ టోర్నీ పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ ఈవెంట్ ఫైనల్స్‌లో ఐశ్వర్య్.. 466.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంతో రజతం గెలిచాడు. చైనాకు చెందిన యుకున్ లియు (467.1) స్వర్ణం సాధించాడు. 0.2 పాయింట్ల తేడాతో భారత షూటర్ స్వర్ణం కోల్పోవడం గమనార్హం. ఫ్రాన్స్ షూటర్ రొమైన్ అఫ్రెరె (454.8) కాంస్యం నెగ్గాడు.
భారత్‌కే చెందిన నీరజ్ కుమార్ (432.6) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు ఈ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లో 24 ఏండ్ల ఐశ్వర్య్.. ఏకంగా 597 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇక పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీమ్ కాంపిటీషన్లో ఇషా, సామ్రాట్ ద్వయం.. 10-16తో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలిచింది. ఈ జోడీకి ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. చైనా జోడీ క్వియాన్‌జున్-కై హు పసిడి నెగ్గింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సామ్రాట్ రాణా.. 243.7 పాయింట్లతో స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.