ముంబై : మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌నకు ముందు సన్నాహకంగా సోమవారం నుంచి ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌లలో భారత ‘ఏ’ జట్టు అదరగొట్టింది. యూఎస్ఏతో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఏ’.. 38 పరుగులతో గెలిచింది. ఢిల్లీ కుర్రాడు అయూశ్ బదోని సారథ్యంలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 రన్స్ చేసింది.
వికెట్‌కీపర్ బ్యాటర్ నారాయణన్ జగదీశన్ (55 బంతుల్లో 104, 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో మెరువగా బదోని (26 బంతుల్లో 60 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ (38) రాణించారు. ఛేదనలో యూఎస్ఏ ఓడినా.. 19.4 ఓవర్లలో 200 పరుగులు చేయడం విశేషం. మరో మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్.. టోర్నీలో బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసిన స్కాట్లాండ్పై 61 పరుగుల తేడాతో ఓడించింది. ఆఫ్ఘాన్ 184/6 స్కోరు చేయగా స్కాట్లాండ్ 123 రన్స్‌కే ఆలౌట్ అయింది.