‘మన డబ్బు, స్టేటస్ అన్నీ మనకు సౌకర్యం ఇవ్వాలి. అహంకారం కాకూడదు’ అన్నది సంజయ్ విశ్వనాథ్ ఫిలాసఫీ. నలభైఏండ్ల వయసున్న ఆయన అంతర్జాతీయ పిస్టల్ షూటర్‌గా రాణిస్తుంటారు. అంతలోనే కుటుంబంలో అనుకోని సమస్య వచ్చిపడుతుంది. ఈ క్రమంలో ఆయన ఓ ఇరవైఏండ్ల అమ్మాయితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారి అనుబంధం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. సూర్య, మమితబైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, ప్రేమ కలబోతగా ట్రైలర్ ఆకట్టుకుంది. సూర్య, మమితబైజు మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ‘మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండీ, గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక’ వంటి డైలాగ్‌లో కథలోని ఎమోషన్‌కు అద్దం పట్టాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తుండగా..సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించాయి.